బెంగాల్‌లో కూడా అలాంటి ఘటనే.. బీజేపీ మహిళా ఎంపీ కంటతడి!

  • 40 మంది దండగులు తనపై దాడి చేశారన్న బెంగాల్ బీజేపీ నాయకురాలు
  • కర్రతో కొట్టి, పోలింగ్ కేంద్రం నుంచి బయటకు తోసేశారని ఆరోపణ
  • మణిపూర్ ఘటనలో వీడియో ఉంది.. ఇక్కడ వీడియో లేదు అంతే అన్న బీజేపీ ఎంపీ
మణిపూర్ లో కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన భయానక ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. అయితే ఇలాంటి ఘటనే పక్క రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లోను వెలుగు చూసింది. ఈ ఘటనలో, పంచాయతీ ఎన్నికల సందర్భంగా జులై 8న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తనని వివస్త్రను చేసి ఊరేగించారని ఓ బీజేపీ గ్రామ సభ అభ్యర్థి తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో హౌరా జిల్లాలోని పంచ్లా ప్రాంతంలో 40 మంది తృణమూల్ దుండగులు తనపై దాడికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను కర్రతో కొట్టి, పోలింగ్ కేంద్రం నుంచి బయటకు తోసేశారని, దాడికి పాల్పడ్డారని వెల్లడించారు.

ఎఫ్‌ఐఆర్‌లో తృణమూల్ అభ్యర్థి హిమంత రాయ్, నూర్ ఆలం, అల్ఫీ ఎస్కే, రణబీర్ పంజా సంజు, సుక్మల్ పంజా సహా పలువురి పేర్లను ప్రస్తావించారు. తనపై దాడి జరుగుతున్నప్పుడు, హిమంత రాయ్ తన చీర, లోదుస్తులను చించివేయాలని ఇతరులను ప్రేరేపించాడని, దీంతో అందరి ముందు తనను బట్టలు విప్పి వేధించారని బాధితురాలు పేర్కొన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తన బట్టలు చింపేసి, వివస్త్రను చేసి, గ్రామమంతా ఊరేగించారని మహిళ ఆరోపించారు. తనను దారుణంగా వేధించారని, తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని తెలిపారు. ఈ ఘటనపై బెంగాల్ బీజేపీ కో-ఇంఛార్జ్ అమిత్ మాలవీయా స్పందిస్తూ... సీఎం మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. ఆమె నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ కూడా విలేకరుల సమావేశంలో ఈ ఘటనపై మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అంటూ మండిపడ్డారు. మమతా బెనర్జీ, పోలీసులు విధించిన ఆంక్షల కారణంగా వీడియో సాక్ష్యాలు లేనప్పటికీ, ఇది దారుణ సంఘటన అని, బాధాకరమన్నారు. తాను మణిపూర్ ఘటనను కూడా ఖండిస్తున్నానని, కానీ తేడా ఏమిటంటే, మణిపూర్ ఘటనకు వీడియో ఉంది, బెంగాల్ ఘటనలో వీడియో లేదన్నారు.


More Telugu News