సన్నబియ్యం సన్నాసి ఒకరు నా తల్లిని అవమానించారు: నారా లోకేశ్ ఫైర్
- ప్రజలను వేధించిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదన్న నారా లోకేశ్
- ప్రభుత్వంపై ఎవరు మాట్లాడినా అక్రమ కేసులు పెడుతున్నారని మండిపాటు
- జేసీ ప్రభాకర్ రెడ్డిపై 65 కేసులు, తనపై 20 కేసులు పెట్టారని వెల్లడి
- ఎక్కడా లేని వేధింపులు ఏపీలోనే ఉన్నాయన్న టీడీపీ నేత
ప్రజలను వేధించిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాముడు లాంటి వారని, కానీ తాను కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఎవరు మాట్లాడినా అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఎర్రఓబనపల్లిలో కమ్మ సామాజికవర్గం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై 65 కేసులు, తనపై 20 కేసులు పెట్టారని లోకేశ్ చెప్పారు. ఎక్కడా లేని వేధింపులు ఏపీలోనే ఉన్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ‘‘సన్నబియ్యం సన్నాసి ఒకరు నా తల్లిని అవమానించారు. నోటికొచ్చినట్లు తిడితే భయపడతామని అనుకుంటున్నారు. 16 నెలలు జగన్ జైలుకెళ్లారు. ఇప్పుడు అందరినీ పంపాలనుకుంటున్నారు” అని లోకేశ్ విమర్శించారు.
పైకి వస్తున్న వాళ్లను అణగదొక్కడమే జగన్ పని అని మండిపడ్డారు. రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టేందుకు కూడా ఎవరూ రాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రయత్నమని లోకేశ్ తెలిపారు.