నేను, మా అన్న, నాన్న సరే.. నా భర్తను లాగడమేమిటి?: అర్వింద్‌పై కవిత ఫైర్

  • అవినీతి ఆరోపణలు నిరూపించాలని 24 గంటల గడువిచ్చిన కవిత 
  • తాను తెచ్చిన స్పైస్ బోర్డును అర్వింద్ తన ఖాతాలో వేసుకున్నాడని ఆరోపణ
  • నిజామాబాద్ లో జాబ్ మేళాను ప్రారంభించిన కవిత
తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ 24 గంటల్లో నిరూపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం సవాల్ చేశారు. లేదంటే ఆయన ముక్కు నేలకు రాయాలన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చిన వాటిని ఇప్పుడు అర్వింద్ తన ఖాతాలో వేసుకుంటున్నారన్నారు. రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను, స్పైస్ బోర్డును తాను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకు వచ్చానన్నారు. తన భర్తపై ఆరోపణలు చేసి, రాజకీయాల్లో లేని ఆయనను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారన్నారు. తాను, తన తండ్రి, అన్న రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఊరుకున్నామని, కానీ తన భర్తను లాగడం సరికాదన్నారు.

జాబ్ మేళాను ప్రారంభించిన కవిత

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌లో ఉద్యోగాల భర్తీ కోసం భూమారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ మేళా ప్రారంభోత్సవానికి కవిత వచ్చారు. దీనిని ప్రారంభించిన అనంతరం కవిత మాట్లాడుతూ... నిజామాబాద్ లో ఐటీ హబ్ గొప్ప విషయం అన్నారు. గ్రామీణస్థాయిలో ఐటీ ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఐటీ హబ్ అంటే కేవలం ఉద్యోగాల కోసం కాదని, ఉద్యోగాలు సృష్టించేది కూడా అన్నారు. యువత ఐటీ హబ్ స్పేస్ ను వినియోగించుకోవాలన్నారు. రెండో దశ ఐటీ హబ్ ను కూడా ప్రారంభిస్తామన్నారు.


More Telugu News