తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు.. పైలం అంటూ హెచ్చరించిన వాతావరణశాఖ

  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
  • ఈ నెల 26 వరకు జోరువానలే
  • అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటున్న వాతావరణశాఖ
  • 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!
దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే రెండో రోజుల్లో ఒడిశాలోని పశ్చిమ- వాయవ్య దిశగా కదలనుంది. ఈ నెల 24న వాయవ్యం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. 

మధ్య భారతదేశంలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురవనుండగా, పశ్చిమ భారతదేశంలోని కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలు, గుజరాత్‌లలో వచ్చే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ భారతదేశం, ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు, తూర్పు భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణలో అతి భారీ వర్షాలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మాదిరి వర్షం కురిసే అవకాశం ఉంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.  ఈ నెల 26 వరకు కొన్ని ప్రాంతాలో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.



More Telugu News