ఇస్లాం కోసం.... 18 ఏళ్లకే ఆటకు వీడ్కోలు పలికిన మహిళా క్రికెటర్

  • 15 ఏళ్లకే పాక్ జట్టుకు ఎంపికైన ఆయేషా నసీమ్
  • 18 ఏళ్ల వయసుకే చివరి మ్యాచ్ ఆడేసిన వైనం
  • ఇస్లాం మతం ప్రకారం ఇకపై పవిత్రంగా జీవిస్తానంటున్న ఆయేషా
  • అందుకే ఆటను వదిలేశానని వెల్లడి
అప్పట్లో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెడితే ఔరా అనుకున్నారు. ఆ తర్వాత కాలంలో చాలామంది క్రికెటర్లు టీనేజి వయసులోనే జాతీయ జట్ల తలుపుతట్టారు. ఇది మహిళా క్రికెటర్లకు కూడా వర్తిస్తుంది. 

18 ఏళ్లకు క్రికెట్ లో అడుగుపెట్టి, ఓ పదిహేనేళ్ల పాటు సేవలు అందించి, ఆ తర్వాత రిటైర్ కావడం సాధారణంగా జరిగేదే. కానీ పాకిస్థాన్ కు చెందిన ఆయేషా నసీమ్ 15 ఏళ్లకే జాతీయ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించి, ఇప్పుడు 18 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ విస్మయానికి గురిచేసింది. 

ఇంత త్వరగా క్రికెట్ కు వీడ్కోలు పలకడానికి ఆయేషా చెప్పిన కారణం... ఇస్లాం మతం. తన జీవితాన్ని ఇస్లాం మతానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నానని, ఇకపై పవిత్రంగా జీవించేందుకే ఆటను వదిలేశానని వెల్లడించింది. 

ఆయేషా నసీమ్ గత ఫిబ్రవరిలో అంతర్జాతీయ స్థాయిలో తన చివరి మ్యాచ్ ఆడింది. ఆమె 15 ఏళ్ల వయసులో ఐసీసీ మహిళల టీ20 చాంపియన్ షిప్ లో పాల్గొంది. ఎంతో బలంగా కనిపించే ఆయేషా అలవోకగా సిక్సర్లు కొడుతుంది. పాకిస్థాన్ తరఫున 30 టీ20 మ్యాచ్ లకు ప్రాతినిధ్యం వహించింది. కెరీర్ లో నాలుగు వన్డేలు మాత్రమే ఆడింది. 

ఎంతో భవిష్యత్ ఉందని భావించిన ఈ యువ క్రికెటర్... టీనేజి ప్రాయంలోనే క్రికెట్ కు దూరం కావడం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. జాతీయ జట్టుకు ఎంపికవడం ఎంతో కష్టమని, అలాంటిది, అర్థాంతరంగా కెరీర్ ను ముగించేయడం సరికాదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.


More Telugu News