సొల్లు కబుర్లు వద్దు పవన్ కల్యాణ్.. సవాల్ చేస్తున్నా.. సై అంటే సై: పేర్ని నాని

  • జగన్ ను జైలుకు పంపిస్తానని మాటలు చెబుతున్నాడని మండిపాటు
  • డేటా చౌర్యంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని సవాల్
  • బీజేపీతో బంధం ఉంటే ఏపీకి ఉపయోగమేమిటని ప్రశ్న
  • మీ ముగ్గురు కలిసి జగన్ ను ఇంటికి పంపించగలరా? అని సవాల్
  • పవన్ సినిమాల్లోనే కాకుండా బయట కూడా వేషాలు వేస్తున్నారని ఎద్దేవా
  • చంద్రబాబు డేటా చౌర్యం చేసినప్పుడు ఏం చేశావని నిలదీత
జగన్ ను జైలుకు పంపిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సొల్లు కబుర్లు చెబుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. తాను జనసేనానికి సవాల్ విసురుతున్నానని... డేటా చౌర్యం అంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై ఎవరితోనైనా విచారణకు సిద్ధమని పేర్ని నాని అన్నారు. 

ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... పవన్ కు దమ్ముంటే, చేతనైతే నీకు ఇష్టం వచ్చిన సంస్థతో లేదా కేంద్ర సంస్థతో విచారణ చేయించుకోవచ్చునన్నారు. మోదీ తన చేతిలో ఉన్నారని, అమిత్ షా తన చేతిలో ఉన్నారని చెబుతున్నారని, నీకు బీజేపీతో బంధం ఉంది కదా.. కేంద్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరిపించాలని, దానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

అమిత్ షాతో మాట్లాడానని చెబుతున్నారని, ఆయనతో మాట్లాడితే నీవు అంత గొప్పనా? అని నిలదీశారు. సై అంటే సై.. నీకు చేతనైంది చేసుకో అని సవాల్ చేశారు. అమిత్ షాతో మాట్లాడితే ఏం జరుగుతుందో చెప్పాలన్నారు. మీకు చేతనైతే మీ ముగ్గురు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్నారు. అఖండ ప్రజలు కోరుకుంటే ఎన్డీయే అధికారంలోకి వస్తుందని పవన్ చెబుతున్నారని, అఖండ ప్రజలు అంటే ఎవరు? అఖండ సినిమానా? అని ఎద్దేవా చేశారు. బీజేపీ పెద్దలతో నీకు సత్సంబంధాలు ఉంటే ఎవరికి ప్రయోజనమని, ఏపీకి ఏమైనా తీసుకు వచ్చావా? అన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు... తీసుకు రావడం లేదన్నారు. ఆయన వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు.

పవన్ కు మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అన్నారు. అసలు హాలీ డే ట్రిప్పు కోసం ఏపీకి వచ్చి ఈ మాటలేంటి? అన్నారు. మీ డేటా అంతా కేసీఆర్ వద్ద ఉందన్నారు. పవన్ సినిమాల్లో కాకుండా బయట కూడా వేషాలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. వేషాలకు అలవాటుపడిన వారు ఇలాగే చేస్తారన్నారు. రాజకీయాల కోసం సిగ్గులేకుండా, కాళ్లు కడిగి కన్యాధానం చేసిన, తండ్రి సమానులైన ఎన్టీఆర్ నే బలి చేసిన చంద్రబాబు.. వాలంటీర్లపై విషం కక్కడం సహజమే అన్నారు. నిన్ను కొడితే చంద్రబాబు కొట్టాలి లేదా అమిత్ షా కొట్టాలి అన్నారు. అసలు ఈ ప్రచారం వల్ల పవన్ కు వచ్చిన రిస్క్ ఏమీ లేదని, జనసేనానిపై పెట్టుబడి పెట్టిన బాబుకే రిస్క్ అన్నారు.

ప్రజాధికారిక సర్వే పేరుతో చంద్రబాబు డేటా చోరీ చేస్తే అప్పుడు ఏమైపోయావని నిలదీశారు. ఆ డేటాను హైదరాబాద్ కు పంపిస్తే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబు డేటా చోరీ చేసినప్పుడు ఎక్కడున్నావో చెప్పాలన్నారు. ఏపీ ప్రజల డేటాను చంద్రబాబు ప్రయివేటు కంపెనీలకు విక్రయించినప్పుడు ఏం చేశావ్? అని ప్రశ్నించారు. ఇప్పుడు రంకెలేస్తున్న పవన్ నాడు నోరు ఎందుకు మెదపలేదన్నారు. అసలు పార్టీ సభ్యత్వం పేరుతో పవన్ సేకరిస్తున్న డేటాను ఎవరికిస్తున్నాడో చెప్పాలన్నారు. సభ్యత్వం కోసం ఫోన్ నెంబర్, ఓటర్ ఐడీ, ఈమెయిల్ ఎందుకని నిలదీశారు.

వచ్చే ఎన్నికల్లో జనసేన 75 సీట్లు తీసుకోవాలని హరిరామజోగయ్య లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ ఈ మూడు పార్టీల పొత్తులో ఎవరి వాటా ఎంతో చెప్పాలన్నారు. అసలు డమ్మీ పొత్తా? లేక జనాలను నమ్మించడానికి పెట్టుకున్న పొత్తా? అని ప్రశ్నించారు. పవన్, చంద్రబాబు గోబెల్స్ వారసులు అన్నారు. బ్రోకర్ పనులు చేసేవారికి బైబై... ప్రజలను మోసం చేసిన వారికి రెండోసారి బైబై.. అంటూ పేర్ని నినాదం ఇచ్చారు.


More Telugu News