భారీ వర్షాలతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

  • తెలంగాణలో నేడు అత్యంత భారీ వర్షాలు
  • రేపటి నుంచి 24 వరకు అతి భారీ వర్షాలు
  • సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎస్ శాంతి కుమారి
తెలంగాణలో జులై 20 (నేడు)న అక్కడక్కడ అత్యంత భారీ వర్షం కురుస్తుందని, జులై 21 నుంచి 24 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) హెచ్చరించింది. ఐఎండీ అలర్ట్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. 

ఇప్పటికే రాజధాని హైదరాబాద్ సహా, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, హైదరాబాదులో వర్షబీభత్సం నెలకొంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావొద్దంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయన్న సూచన ఉందని శాంతికుమారి తెలిపారు. హైదరాబాదులో భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని 40 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మోహరించినట్టు వివరించారు. ములుగు, వరంగల్, కొత్తగూడెం ప్రాంతాల్లోనూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 

భద్రాచలం వద్ద గోదావరి నదికి వరదనీరు వస్తోందని, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామని వెల్లడించారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలిపారు. 

వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటిమట్టాన్ని నిశితంగా గమనిస్తున్నామని సీఎస్ వివరించారు. తెలంగాణలోని ప్రాజెక్టుల్లో ఇప్పటికి సగం నీరే ఉందని, ఇప్పటికిప్పుడు వాటికి వరద పోటెత్తినా ప్రమాదమేమీ లేదని పేర్కొన్నారు.


More Telugu News