లోక్ సభలో సోనియా వద్దకు వెళ్లి, ఆరోగ్యంపై ప్రధాని మోదీ వాకబు
ఇటీవల సోనియా, రాహుల్ వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
లోక్‌సభలో సోనియాను పలుకరించిన ప్రధాని
- ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న మోదీ
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం మొదలైన విషయం తెలిసిందే. లోక్‌సభ కార్యకలాపాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ నేత సోనియా గాంధీని ప్రధాని నరేంద్ర మోదీ పలుకరించారు. సోనియా గాంధీ కూర్చున్న చోటుకు వెళ్లి.. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో ‘నేను బాగున్నాను’ అని సోనియా బదులిచ్చారు. ఇటీవల సోనియా, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ విషయాన్ని ప్రస్తావించిన మోదీ.. తర్వాత ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
ఇదిలాఉండగా.. పార్లమెంట్ సమావేశాల తొలిరోజే ఉభయసభలు అట్టుడికాయి. మణిపూర్ లో చెలరేగిన హింసపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో రెండు సభలూ రేపటికి వాయిదా పడ్డాయి. మరోవైపు మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రధాని మోదీ.. ఆ దారుణానికి పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదలమని స్పష్టం చేశారు. ఆ ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసిందన్న ఆయన.. కుమార్తెలకు జరిగిన అన్యాయాన్ని ఎన్నటికీ క్షమించలేమన్నారు.