కిషన్ రెడ్డి వస్తానంటే నేనే తీసుకెళ్లి చూపిస్తా: తలసాని

  • డబుల్ బెడ్రూం ఇళ్లపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న మంత్రి
  • బీజేపీ నేతలది పొలిటికల్ డ్రామా అంటూ విమర్శలు
  • రూ.8.65 లక్షలతో ఇల్లు కడితే కేంద్రం ఇచ్చేది రూ.1.50 లక్షలేనని వివరణ
బీజేపీ నేతలు చేపట్టిన చలో బాటసింగారం కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సహా పలువురు నేతలను నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. కాగా, ఈ విషయంపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంపై బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వస్తానంటే తానే స్వయంగా తీసుకెళ్లి డబుల్ బెడ్రూం ఇళ్లను చూపిస్తానని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో కేంద్రం వాటా తక్కువేనని మంత్రి తలసాని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.8.65 లక్షలు వెచ్చించి డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మిస్తుంటే కేంద్రం కేవలం రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన రూ.600 కోట్లు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వనేలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీరు ఇలా ఉంటే ఇక్కడ బీజేపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని తలసాని మండిపడ్డారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించడం అవసరమా? అని ప్రశ్నించారు. గతంలో ఇదే కేంద్ర మంత్రితో కలిసి తాను డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవం చేశానని తలసాని చెప్పారు. ఆ కార్యక్రమంలో డబుల్ బెడ్రూం ఇళ్లు బాగా నిర్మించారని కిషన్ రెడ్డి మెచ్చుకున్నారని గుర్తుచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కిషన్ రెడ్డి తన షెడ్యూల్ మార్చుకుని సడెన్ గా బాటసింగారం ప్రోగ్రాం పెట్టుకున్నారని ఆరోపించారు. ఓవైపు ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలతో జనం ఇబ్బంది పడుతుంటే బీజేపీ నేతలు మరింత ఇబ్బంది పెడుతున్నారని తలసాని మండిపడ్డారు.


More Telugu News