500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్న కోహ్లీ... ఆకాశ్‌చోప్రా ప్రశంసలు

  • భారత్-విండీస్ మధ్య నేడు రెండో టెస్టు
  • ఇరు జట్లకు ఇది వందో టెస్టు
  • కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్
  • విరాట్ సేవలకు తామందరం కృతజ్ఞతగా ఉంటామన్న ఆకాశ్ చోప్రా
  • క్రికెట్‌కు అతడు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ప్రశంసలు
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య నేడు ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో రెండోటెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు బోల్డన్ని ప్రత్యేకతలున్నాయి. రెండు జట్లకు ఇది వందో టెస్టు మ్యాచ్ కాగా, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్. కోహ్లీ ఇప్పటి వరకు 110 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. 20 వేలకుపైగా పరుగులు సాధించాడు. చారిత్రక మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా 34 ఏళ్ల కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. అతడి అంకితభావానికి హ్యాట్సాఫ్ చెప్పాడు. క్రికెట్ కు చెందిన తన జీవితాన్ని కోహ్లీ ఓ సాధువులా గడుపుతాడని ప్రశంసించాడు. అతడు అందించిన సేవలకు జట్టు కృతజ్ఞతగా ఉంటుందని పేర్కొన్నాడు. 

జియో సినిమాతో చోప్రా మాట్లాడుతూ.. ఆటపై కోహ్లీకి ఉన్న అంకితభావం చాలా స్పష్టంగా ఉందని, క్రికెట్ విషయానికి వస్తే అతడు ఓ సాధువులా జీవించాడని పేర్కొన్నాడు. కాబట్టే అతడు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడని అన్నాడు. ఈ బ్యూటిఫుల్ గేమ్‌కు అతడు బ్రాండ్ అంబాసిడరని కొనియాడాడు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలకు తామందరం అతడికి కృతజ్ఞతతో ఉండాలని తెలిపాడు. 

ప్రపంచంలో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో కోహ్లీ ఆరోస్థానంలో ఉండగా, అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 500వ మ్యాచ్ ఆడుతున్న నాలుగో ఇండియన్ క్రికెటర్‌గా రికార్డులకెక్కనున్నాడు.


More Telugu News