తెలంగాణలో అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

  • తెలంగాణలో విస్తారంగా వర్షాలు
  • భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునక
  • పలు జిల్లాలలో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు
  • భారీ, అతి భారీగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణను ప్రస్తుతం భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.  వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. 

హైదరాబాద్‌లో బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తీవ్రమైన గాలులకు చెట్లు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్‌లో ఓ చెట్టుకొమ్మ విరిగి కరెంట్ పోల్‌పై పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 

మరోవైపు, తెలంగాణలో పలు జిల్లాలను భారీ వర్షం ముంచెత్తింది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. అటవీ ప్రాంతాల్లోని వాగుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. కుమురంభీం జిల్లా బెజ్జూర్‌లో 14 సెం.మీ వర్షం పాతం నమోదైంది. మెదక్ జిల్లా వెల్దుర్తిలో 15 సెం.మీ, దామరంచలో 13 సెం.మీ, రాజపల్లిలో 12 సెం.మీ వర్షపాతం రికార్డయింది. యాదాద్రి భువనగిరిలోని రాజాపేట మండలంలో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. గోదావరి ఎగువ నుంచి నీరు పోటెత్తడంతో భద్రాచలం వద్ద 39 అడుగులకు నీరు చేరింది. మరో నాలుగు అడుగుల మేర నీటి మట్టం పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది.


More Telugu News