ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయం.. భారత్‌లో..!

  • గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో సిద్ధమైన ‘డైమండ్ ట్రేడింగ్ బౌర్స్’
  • 35 ఎకరాల్లో, 15 అంతస్తుల నిర్మాణం
  • అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్ ను మించిపోనున్న  వైనం
  • నవంబర్‌లో ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం
భారత్‌ మరో రికార్డును సొంతం చేసుకోనుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆఫీసు భవనం ఉన్న దేశంగా చరిత్ర సృష్టించనుంది. డైమండ్ ట్రేడింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన సూరత్ నగరంలో(గుజరాత్‌) 35 ఎకరాల స్థలంలో 15 అంతస్తులున్న భారీ భవనం ‘సూరత్ డైమండ్ బౌర్స్’ తాజాగా అందుబాటులోకి రానుంది. వజ్రాల వాణిజ్యానికి సంబంధించి అన్ని సేవలు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. కట్టర్స్, పోలిషర్స్ వంటి వృత్తినిపుణులతో పాటూ వజ్రాల వ్యాపారుల వంటి వారందరూ ఈ భవనంలో కొలువు దీరనున్నారు.

వ్యాపార కార్యాకలాపాల కోసం ఈ భవనంలో 7.1 మిలియన్ చదరపు అడుగుల ఫ్లోర్ స్పేస్ అందుబాటులో ఉండనుందని భవనం ఆర్కిటెక్ట్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికా రక్షణ శాఖ కార్యాలయం ఉన్న పెంటగాన్ భవనం కంటే ఇది పెద్దదని పేర్కొన్నారు. 

నవంబర్‌లో ప్రధాని మోదీ సూరత్ డైమండ్ బౌర్స్‌ ను ప్రారంభించనున్నారు. దీనిపై ఆయన ప్రశంసలు కురిపించారు. సూరత్‌‌లో వజ్రాల వాణిజ్యం విశిష్టత, గొప్పదనానికి భవంతి నిర్మాణ శైలి అద్దంపడుతోందని వ్యాఖ్యానించారు. భారతీయుల వ్యాపారదక్షత, నాయకత్వ లక్షణాలకు ఇది సాక్ష్యం. కొత్త వాణిజ్యావకాశాలు, సృజనాత్మకత, కొత్త భాగస్వామ్యాలు, అవకాశాలను సృష్టిస్తుందని వ్యాఖ్యానించారు. భారత్‌లోని ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ మార్ఫోజెనిసిస్ దీన్ని డిజైన్ చేసింది. ఈ భవనం అందుబాటులోకి వస్తే వేల మంది వ్యాపార కార్యకలాపాల కోసం ప్రతి రోజూ ముంబైకి వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని చెప్పారు.


More Telugu News