మాతృభాష రాదని గొప్పగా చెప్పుకుంటున్నారు.. ఇదివరకు సిగ్గుపడేవారు: ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • మాతృభాష బోధనపై హైకోర్టులో పిటిషన్
  • అయిదో తరగతి విద్యార్థి కనీసం రెండో తరగతి పుస్తకం చదవలేకపోతున్నారన్న పిటిషనర్
  • మాతృభాషపై పట్టులేనందుకు సిగ్గుపడాలన్న హైకోర్టు
  • మాతృభాషను నేర్పించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్న ఉన్నత న్యాయస్థానం  
పాఠశాలల్లో మాతృభాష బోధనపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మాతృభాష బోధన, పరీక్షలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మాతృభాషపై పరీక్షలు సరిగ్గా నిర్వహించలేదని పిటిషనర్ తన వాదనలను వినిపించారు. దీనికి సంబంధించి పరీక్షల వివరాలు కూడా వెల్లడించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయిదో తరగతి విద్యార్థి కనీసం రెండో తరగతి తెలుగు పుస్తకాన్ని చదవలేకపోతున్నారన్నారు.

ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాతృభాష రాకుంటే ఇతర భాషలపై విద్యార్థులకు పట్టు ఎలా ఉంటుంది? అని ప్రశ్నించింది. గతంలో మాతృభాష రాకుంటే సిగ్గుపడేవారని, ఇప్పుడు తనకు రాదని గొప్పగా చెప్పుకుంటున్నారని పేర్కొంది. అయిదో తరగతి పిల్లవాడు రెండో తరగతి పుస్తకాన్ని చదవలేనందుకు సిగ్గుపడాలని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మాతృభాషను నేర్పించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? పిల్లల అధ్యయన సామర్థ్యాన్ని పెంచేందుకు ఏం చేస్తున్నారు? అనే అంశాలపై సమాధానం చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News