కర్ణాటక అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం

  • బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి ఐఏఎస్ అధికారుల బృందం
  • ఐఏఎస్ అధికారులను దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నిరసన
  • పది మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్  
కర్ణాటక అసెంబ్లీ బుధవారం రసాభాసగా మారింది. స్పీకర్ తీరును నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు బైఠాయించడం, ఆ తర్వాత సభాపతి పైకి కాగితాలు విసరడంతో ఆ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత స్పీకర్ యూటీ ఖాదర్‌పై ప్రతిపక్ష బీజేపీ, కర్ణాటక జనతా దళ్ సెక్యూలర్ కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.  

రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారులను దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీకి చెందిన కొందరు సభ్యులు బిల్లులు, అజెండా కాపీలను చించి, స్పీకర్ పైకి విసిరేశారు. అదే సమయంలో మధ్యాహ్న భోజన విరామం లేకుండా ప్రొసీడింగ్స్ నిర్వహించడంపై కూడా సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళ దృశ్యాలు కనిపించాయి. బెంగళూరులో నిన్న ముగిసిన రెండు రోజుల ప్రతిపక్ష పార్టీల ఐక్యతా సమావేశానికి సంబంధించి ఐఎఎస్ అధికారుల బృందాన్ని నియమించారు. దీనిని బీజేపీ తప్పుబట్టింది.

సభలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ పదిమంది బీజేపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలలో డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్, వి సునిల్ కుమార్, ఆర్ అశోక, అరగ జ్ఞానేంద్ర, డి వేదవ్యాస కామత్, యశ్‌పాల్ సువర్ణ, ధీరజ్ మునిరాజ్, ఎ ఉమానాథ్ కొటియన్, అరవింద్ బెల్లాడ్, వై భరత్ శెట్టి ఉన్నారు.


More Telugu News