అతను ప్రపంచ కప్ జట్టులో ఉండాల్సిందేనంటున్న గంగూలీ

  • యువ ఆటగాడు యశస్విపై ప్రశంసల వర్షం
  • వెస్టిండీస్‌ పై తన తొలి టెస్టులోనే భారీ శతకం సాధించిన జైస్వాల్
  • భారత్ కు సుదీర్ఘకాలం ఆడే సత్తా అతనిలో ఉందన్న గంగూలీ
వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో భారీ శతకంతో అనేక రికార్డులు బద్దలు కొట్టిన భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ పై దిగ్గజ ఆటగాడు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. స్వదేశంలో అక్టోబర్–నవంబర్‌‌ లో జరిగే ప్రపంచ కప్ లో అతడిని కచ్చితంగా ఆడించాలన్నాడు. యశస్విని భారత ప్రపంచ కప్ జట్టులోకి తీసుకోవాలని సెలెక్షన్ కమిటీకి సూచించాడు. 

‘ప్రపంచ కప్‌లో జైస్వాల్‌ ఆడితే చూడాలనుకుంటున్నా. అతనిలో చాలా నైపుణ్యం ఉంది. ఐపీఎల్‌ లో అతడిని చాలా దగ్గరి నుంచి చూశా. పరిమిత ఓవర్ల కంటే టెస్టు క్రికెట్‌లో ఆట సవాల్‌ తో కూడుకున్నది. అది భిన్నంగా కూడా ఉంటుంది. అయితే, టెస్టుల్లోనూ అతను విజయం సాధించాడు. భారత జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించే సత్తా యశస్విలో ఉంది’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. 

భారత జట్టు  వ్యూహాత్మక కోణంలోనూ జైస్వాల్‌ కు వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డాడు. ‘జట్టు టాపార్డర్‌లో కుడి–ఎడమ కాంబినేషన్‌ను ఆడిస్తే ఫలితం ఉంటుంది. దీనివల్ల ప్రత్యర్థి బౌలర్లను ఇబ్బంది పెట్టొచ్చు.  కుడి, ఎడమ బ్యాటర్లకు బౌలింగ్ చేయాలంటే బౌలర్లు వారికి తగ్గట్టుగా వెంటవెంటనే లైన్‌ అండ్ లెంగ్త్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల కొన్నిసార్లు బౌలింగ్‌ లయ తప్పుతుంది. అది బ్యాటర్లకు ఉపయోగపడుతుంది’ అని గంగూలీ పేర్కొన్నాడు.


More Telugu News