ఒంగోలులో అమానవీయ ఘటన.. గిరిజన యువకుడిని చావబాది.. నోట్లో మూత్రం పోసి 9 మంది దాడి

  • స్నేహితుల మధ్య విభేదాలు
  • రమ్మని పిలిచి మద్యం తాగించి మరికొందరితో కలిసి దాడి
  • కాళ్లావేళ్లా పడి వేడుకున్నా కనికరించని వైనం
  • నిందితులపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
  • బాధితుడు, ప్రధాన నిందితుడిపై 50కిపై దొంగతనం కేసులు
  • పరారీలో ప్రధాన నిందితుడు
ఒంగోలులో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ఓ గిరిజన యువకుడితో ఫుల్లుగా మద్యం తాగించిన కొందరు వ్యక్తులు అతడిని చావబాది ఆపై నోట్లో మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందారు. అంతేకాదు, మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని బలవంతం చేస్తూ చితకబాదారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీశారు. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాధితుడైన గిరిజన యువకుడి పేరు మోటా నవీన్. ప్రధాన నిందితుడు మన్నె రామాంజనేయులు (అంజి) ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. నేరాలకు పాల్పడే వీరిపై 50కిపైగా గృహ దొంగతనాల కేసులు ఉన్నాయి. నవీన్ పలుమార్లు జైలుశిక్ష కూడా అనుభవించాడు. అంజి మాత్రం కొన్నేళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కొంతకాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి.

నెల రోజుల క్రితం మద్యం తాగుదామంటూ నవీన్‌ను అంజి ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రి వద్దకు పిలిచాడు. వెళ్తే అక్కడ మొత్తం 9 మంది కనిపించారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. ఆపై అంజి, నవీన్ మధ్య పాత గొడవ మరోమారు రేగింది. దీంతో అందరూ కలిసి నవీన్‌పై దాడిచేశారు. తనను వదిలెయ్యాలని బతిమాలినా వినిపించుకోలేదు. రక్తమోడేలా కొట్టారు. ఆపై నవీన్ నోట్లో మూత్రం పోస్తూ మర్మాంగాన్ని అతడి నోట్లో పెట్టుకోమని బలవంతం చేశారు. కొందరు ఈ తతంగం మొత్తాన్ని సెల్‌ఫోన్లో చిత్రీకరించారు. 

ఆ తర్వాత బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అదికాస్తా ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, ఇద్దరిని మాత్రం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


More Telugu News