​జగన్ వచ్చాడు... రైతాంగం సంక్షోభంలో పడింది: నారా లోకేశ్

  • కొండపి నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం
  • కె.అగ్రహారంలో బహిరంగ సభ
  • పొగాకు గ్రేడింగ్ మహిళలతో లోకేశ్ మాటామంతీ
  • లోకేశ్ ను కలిసిన పొగాకు రైతులు
  • కనిగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తింది. 158వ రోజు యువగళంలో భాగంగా కె.అగ్రహారంలో నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. యువగళం రాకతో అగ్రహారం వీధులు జనసంద్రాన్ని తలపించాయి. 

లోకేశ్ పాదయాత్రకు కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభించింది. చెరుకువారిపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర... చెరువుకొమ్ముపాలెం, కె.అగ్రహారం, పరుచూరివారిపాలెం మీదుగా పాలేటి గంట వద్ద కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. 

కనిగిరి ఇన్ ఛార్జి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నేతృత్వంలో పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువనేతకు భారీ గజమాలలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గంగమ్మ దేవతను దర్శించుకున్నారు. 

పొగాకు గ్రేడింగ్ మహిళా కూలీలను కలిసిన లోకేశ్

కొండపి నియోజకవర్గం చెరువుకొమ్ముపాలెంలో ఓ పొగాకు గోడౌన్ కు వెళ్లిన యువనేత లోకేశ్, అక్కడ పనిచేస్తున్న పొగాకు గ్రేడింగ్ కూలీలను కలిసి, వారి సమస్యలు తెలుసుకున్నారు. 

గ్రేడింగ్ మహిళా కూలీలు మాట్లాడుతూ... సీజనల్ గా ఏడాదిలో మూడునెలలు మాత్రమే తమకు పనిదొరుకుతుందని, మిగిలిన రోజుల్లో ఖాళీగా ఉండాల్సి వస్తోందని తెలిపారు. పొగాకు పనివల్ల అనారోగ్యానికి గురయ్యే వారికి ప్రభుత్వం తరపున బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గించి, ఏడాదంతా తమకు పని కల్పించేలా పరిశ్రమలు తీసుకురావాలని పొగాకు గ్రేడింగ్ మహిళా కూలీలు లోకేశ్ ను కోరారు.

అందుకు నారా లోకేశ్ స్పందిస్తూ... కొండపి ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పొగాకు గ్రేడింగ్ పనిచేసే మహిళా కూలీలకు చంద్రన్న బీమా పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. 

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన బాదుడే బాదుడు అన్న చందంగా కొనసాగుతోందని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వస్తువుల ధరలతో పాటు అడ్డగోలు పన్నులను తగ్గిస్తామని స్పష్టం చేశారు. 

యువనేతను కలిసిన పొగాకు రైతులు

కొండపి అసెంబ్లీ నియోజకవర్గం చెరువుకొమ్ముపాలెంలో పొగాకు రైతులు యువనేత లోకేశ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 

పొగాకు రైతుల వినతిపై లోకేశ్ స్పందిస్తూ... జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. జగన్ నేతృత్వంలో దివాలాకోరు ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు కరెంటు బిల్లులు కట్టలేక మూలన పెట్టిందని మండిపడ్డారు. పొగాకు రైతులకు బ్యారన్ల మంజూరుపై టుబాకో బోర్డు అధికారులతో చర్చించి, రైతులకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

దీర్ఘకాలంగా గయాళా భూములను సాగుచేసిన వారికి పట్టాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కొండపి ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి, వలసలను నివారిస్తామని భరోసా ఇచ్చారు.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2,092.9 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 10.0 కి.మీ.*

*159వరోజు (19-7-2023) యువగళం పాదయాత్ర వివరాలు*

*కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం (ప్రకాశం జిల్లా)*

మధ్యాహ్నం

12.00 – పెద్దలవలపాడు శివారు క్యాంప్ సైట్ లో కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ వలస కార్మికులతో రచ్చబండ కార్యక్రమం.

సాయంత్రం

3.00 – పెద్దలవలపాడు శివార్ల నుండి పాదయాత్ర ప్రారంభం.

3.05 – పెద్దలవలపాడు బ్రిడ్జి వద్ద స్థానికులతో మాటామంతీ.

4.35 – రామాపురం – గుడారివారిపాలెం గ్రామస్తులతో సమావేశం.

6.05 – అజీజ్ పురంలో స్థానికులతో సమావేశం.

6.20 – అజీజ్ పురంలో పాదయాత్ర 2,100 కి.మీ. చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.

8.20 – కనిగిరి శివారు శంఖవరం విడిది కేంద్రంలో బస.

******



More Telugu News