ఇక I-N-D-I-A వర్సెస్ ఎన్డీయే: రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ

  • ఇది బీజేపీ, ప్రతిపక్షాల మధ్య యుద్ధం కాదన్న రాహుల్
  • ప్రజల స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కోసం చేస్తోన్న యుద్ధమని వ్యాఖ్య
  • I-N-D-I-A గెలిచి... బీజేపీ ఓడిపోతుందని మమత జోస్యం
బీజేపీ తన అధికారం కోసం దేశాన్ని ఆక్రమిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ధ్వజమెత్తారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశం ఈ రోజు సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా హాజరైన నేతలను ఉద్ధేశించి రాహుల్ మాట్లాడుతూ.. ఇది బీజేపీ, ప్రతిపక్షాల మధ్య యుద్ధం కాదని, ఇది ప్రజల స్వాతంత్ర్యం కోసం, స్వేచ్ఛ కోసం చేస్తోన్న యుద్ధమన్నారు. తమ యాక్షన్ ప్లాన్ ను తదుపరి జరగనున్న ముంబై సమావేశం సందర్భంగా వెల్లడిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే వర్సెస్ 'ఇండియా' (I-N-D-I-A)గా పోరు ఉంటుందని ప్రకటించారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే, I-N-D-I-A మధ్య పోరు ఉంటుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మా I-N-D-I-Aను ఎన్డీయే ఛాలెంజ్ చేస్తుందా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో I-N-D-I-A గెలుస్తుందని, బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. విపక్ష నేతల పైకి బీజేపీ సీబీఐ, ఈడీని ప్రయోగిస్తోందని ఆరోపించారు. తొమ్మిదేళ్లలో బీజేపీ ప్రతి వ్యవస్థను నాశనం చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. రైల్వే వ్యవస్థను కూడా నాశనం చేశారన్నారు.


More Telugu News