పవన్ కల్యాణ్ ఓ రాజకీయ బ్రోకర్‌లా మారిపోయారు: సీపీఐ నారాయణ

  • టీడీపీని ఎన్డీయేకు దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ
  • అదే జరిగితే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లేనన్న సీపీఐ నారాయణ
  • వైసీపీని కూడా బీజేపీ వదులుకోదని జోస్యం
  • హోదా హామీ ఇచ్చి నెరవేర్చని బీజేపీతో ఎలా జతకడుతున్నారని ప్రశ్న
ఎన్డీయే కూటమి సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీపీఐ నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఓ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ.. పవన్ ఓ రాజకీయ బ్రోకర్‌లా మారారని, తెలుగుదేశం పార్టీని ఎన్డీయేకు దగ్గర చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రెండు పార్టీల మధ్య అనుసంధానం చేస్తున్నారన్నారు. అదే కనుక జరిగితే ఏపీలో వైసీపీ నెత్తిన పాలుపోసినట్లే అన్నారు. బీజేపీతో జతకట్టిన కూటమికి వ్యతిరేకంగా మైనార్టీలు అందరూ ఏకమై వైసీపీని గెలిపించడం ఖాయమన్నారు. అయితే అదే సమయంలో వైసీపీని కూడా బీజేపీ వదులుకోదన్నారు.

ప్రత్యేక హోదా హామీ ఇచ్చి, ఆ హామీని ఇప్పటి వరకు నెరవేర్చని బీజేపీతో పవన్ కల్యాణ్ ఎలా అంటకాగుతారని ప్రశ్నించారు. నిన్నటి వరకు చెగువేరా దుస్తులు ధరించిన జనసేనాని ఇప్పుడు వీరసావర్కర్ దుస్తులు వేసుకోవడానికి సిద్ధపడ్డారని,రేపు గాడ్సేలా తుపాకీ పట్టుకోవడానికి కూడా సిద్ధమవుతారని ఎద్దేవా చేశారు. పవన్ రాజకీయ స్థిరత్వంపై మాట్లాడుతూ, మొదట ఆయన మూడు నిమిషాలు కదలకుండా నిలబడగలిగితే ఆ తర్వాత ఈ అంశంపై మాట్లాడుదామన్నారు.


More Telugu News