హిండెన్‌బర్గ్‌ నివేదికపై మరోసారి స్పందించిన అదానీ!

  • తమ సంస్థలపై ‘హిండెన్‌బర్గ్‌’ ఇచ్చిన నివేదిక పూర్తిగా దురుద్దేశపూరితమన్న అదానీ 
  • తప్పుడు సమాచారం, అసత్య ఆరోపణలతో నివేదిక రూపొందించారని మండిపాటు
  • తమ స్టాక్ ధరలను తగ్గించి లాభాలు పొందాలని చేసిన ప్రయత్నమని ఆరోపణ
  • అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఏజీఎంలో ప్రసంగం
తమ సంస్థలపై అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ ‘హిండెన్‌బర్గ్‌’ ఇచ్చిన నివేదిక పూర్తిగా దురుద్దేశపూరితమని అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ అన్నారు. తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే నిరాధార ఆరోపణలు చేశారని చెప్పారు. ఈ రోజు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వార్షిక సమావేశం (ఏజీఎం)లో షేర్‌ హోల్డర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

‘‘భారత చరిత్రలోనే అతిపెద్ద ఫాలో ఆన్‌ పబ్లిక్ ఆఫరింగ్‌ (ఎఫ్‌పీవో)ను ప్రారంభించేందుకు మేం సిద్ధపడుతున్న వేళ.. హిండెన్‌బర్గ్‌ ఈ నివేదికను ప్రచురించింది. తప్పుడు సమాచారం, అసత్య ఆరోపణలతో ఆ నివేదికను రూపొందించారు. మా ప్రతిష్ఠను దెబ్బతీయడం, మా స్టాక్ ధరలను తగ్గించి లాభాలను ఆర్జించాలన్న లక్ష్యంతోనే ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం అది’’ అని గౌతమ్‌ అదానీ మండిపడ్డారు. తమ కంపెనీ ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడలేదని నిపుణుల కమిటీ గుర్తించిందని ఆయన తెలిపారు. నిపుణుల కమిటీ నివేదికతో వాటాదారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు.

మోసపూరిత లావాదేవీలు, స్టాక్‌ ధరల తారుమారు వంటి అవకతవకలకు అదానీ గ్రూప్‌ పాల్పడిందంటూ గతంలో హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జనవరి 24న హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్‌ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ఎఫెక్ట్‌తో ఎఫ్‌పీఓను అర్ధంతరంగా ఉపసంహరించుకుంది. ఈ రిపోర్టుపై ఈ ఏడాది మే నెలలో నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. అవకతవలకు సంబంధించి ఎటువంటి సాక్ష్యాలూ కనిపించలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ నివేదికను సెబీ పరిశీలిస్తోంది.


More Telugu News