జీతం ఎక్కువ తీసుకున్నాం.. రూ. 6 వేల కోట్లు తిరిగిచ్చేస్తామంటున్న టెస్లా డైరెక్టర్లు

  • షేర్ హోల్డర్ల ఒత్తిడితో తీసుకున్న జీతాన్ని వాపస్ చేస్తున్న డైరెక్టర్లు
  • 2017 నుంచి 2020 మధ్యలో పెద్ద మొత్తంలో కంపెనీ షేర్లు కేటాయించుకున్న వైనం
  • టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పైనా ఇదే తరహా కేసు
ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలో సంచలనాలు సృష్టించిన టెస్లా కంపెనీ తాజాగా మరోమారు వార్తల్లోకెక్కింది. కంపెనీ డైరెక్టర్లు పొందుతున్న జీతాలు, అలవెన్సులపై రచ్చ జరుగుతోంది. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ తో పాటు పలువురు డైరెక్టర్లు భారీ మొత్తాలను జీతాలుగా పొందుతున్నారని షేర్ హోల్డర్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఓ షేర్ హోల్డర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కంపెనీ నిధులను ఎలాన్ మస్క్ తన విలాసాల కోసం వెచ్చించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఈ కేసులో మస్క్ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీతాలు, అలవెన్సులతో పాటు ఇతరత్రా మార్గాల్లో కంపెనీ నుంచి తాము తీసుకున్న అధిక వేతనాన్ని తిరిగిచ్చేస్తామని టెస్లా డైరెక్టర్లు ప్రకటించారు. 2017 నుంచి 2020 మధ్యలో తమకు తామే కేటాయించుకున్న నిధులు, షేర్లకు సంబంధించి సుమారు రూ.6 వేల కోట్లను కంపెనీ ఖాతాలో జమచేయనున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు, అమెరికాలోని టెక్సాస్ లో విలాసవంతమైన అద్దాల భవంతిని తనకోసం నిర్మించుకునేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నించాడని కంపెనీ షేర్ హోల్డర్లలో ఒకరైన రిచర్డ్ టార్నెట్టా ఆరోపించారు. ఇందుకోసం కంపెనీ నిధులలో నుంచి పెద్దమొత్తంలో కేటాయింపులు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు. దీంతో పాటు 2018-2019 ఏడాదికి గానూ ఎలాన్ మస్క్ కనీవినీ ఎరగని రీతిలో కాంపెన్సేషన్ పొందారని, సీఈవో హోదాలతో తనకు తాను ఈ ప్యాకేజీ ప్రకటించుకున్నారని ఆరోపించారు. కాగా, ఈ విషయంపై ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోందని రిచర్డ్ తెలిపారు.


More Telugu News