​​మా వద్దే ఫీడ్ కొనాలని, మాకే పాలు పోయాలని మేం ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు: లోకేశ్

  • కొండపి నియోజకవర్గంలో యువగళం
  • మాలెపాడులో పాడిరైతులతో లోకేశ్ సమావేశం
  • తమకు ఫీడ్ కంపెనీ ఉందని లోకేశ్ వెల్లడి
  • అధికారంలో ఉన్నప్పుడు తమ వద్దే ఫీడ్ కొనాలని ఒత్తిడి చేయలేదని స్పష్టీకరణ
  • హెరిటేజ్ కే పాలు పోయాలని బలవంతం చేయలేదని ఉద్ఘాటన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలో విజయవంతంగా ముందుకు సాగుతోంది. 157వ రోజు యువగళం పాదయాత్ర మాలెపాడు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. మంగళవారం నాడు లోకేశ్ కొండపి నియోజకవర్గం కె.అగ్రహారంలో జరిగే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. అనంతరం పాలేటిగంగ వద్ద యువగళం పాదయాత్ర కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

మూతపడిన సహకార డెయిరీలన్నింటినీ తెరిపిస్తాం

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూతపడిన సహకార డైరీలన్నింటినీ తెరిపించి, పాడిరైతులకు లబ్ధి కలిగిస్తామని నారా లోకేశ్ పేర్కొన్నారు. కొండపి నియోజకవర్గం మాలెపాడులో పాడిరైతులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ... ఒంగోలు డెయిరీని అమూల్ కు అప్పగించేశారని ఆరోపించారు. 

"జగన్ కోఆపరేటివ్ డైరీల ఆస్తులన్నింటినీ అమూల్ కి ధారాదత్తం చేస్తున్నాడు. గతంలో జగన్ హెరిటేజ్ పాడి రైతుల్ని దోచుకుంటుందని తప్పుడు ప్రచారం చేశారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలి అనేది టీడీపీ విధానం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాడి రైతుల పెట్టుబడి తగ్గిస్తాం. పశువులు కొనడం దగ్గర నుండి పశుగ్రాసం, దాణా, మందుల సరఫరా వరకూ అన్ని సబ్సిడీలో అందిస్తాం. 

మినీ గోకులాలను ఏర్పాటుచేసి, పశుసంపదను పరిరక్షిస్తాం. ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమను దేశంలోనే నెంబర్ వన్ చేసే లక్ష్యంతో పనిచేస్తాం. గతంలో ఒంగోలు డెయిరీ మూతపడే పరిస్థితి వస్తే రూ.35 కోట్లు గ్రాంట్ ఇచ్చి డైరీని నడిపించాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మూసేసిన ఒంగోలు డైరీని తిరిగి ప్రారంభిస్తాం" అని వెల్లడించారు.

పాడిరైతులను మోసం చేసిన జగన్!

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ ధరలు తగ్గిస్తాం. పాడి రైతులకు అనేక హామీలు ఇచ్చి జగన్ మోసం చేశాడు. లీటర్ కి అదనంగా రూ.4 బోనస్ ఇస్తానని మోసం చేశాడు. పాడిరైతులకు పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయింది. 

టీడీపీ హయాంలో పశువులు కొనడం దగ్గర నుండి పశుగ్రాసం, దాణా, మందులు సబ్సిడీలో అందించాం. జగన్ అన్ని సబ్సిడీలు ఎత్తేశాడు. టీడీపీ హయాంలో గోపాలమిత్రలను పెట్టి పశువులకు వైద్యం ఉచితంగా అందించాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో పాడి రైతులకు ఇచ్చిన అన్ని సబ్సిడీలు అందిస్తాం.

మేము ఎప్పుడూ రైతులపై ఒత్తిడి తేలేదు!

విజయ డెయిరీ తెరుస్తామని చెప్పి ఆస్తులు అన్నీ అమూల్ కి కట్టబెట్టాడు జగన్. 1992లో హెరిటేజ్ డెయిరీని చంద్రబాబు ప్రారంభించారు. మేము విలువలతో హెరిటేజ్ కంపెనీని నడిపిస్తున్నాం. రైతులకు సమయానికి డబ్బులు ఇస్తుంది హెరిటేజ్ కంపెనీ. 

చంద్రబాబునాయుడు కోఆపరేటివ్ డైరీ లను ఆదుకున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ డైరీలు ఉన్నప్పుడే పాడి రైతులకు మేలు జరుగుతుంది. మన రాష్ట్రంలో ఉన్న కోఆపరేటివ్ డెయిరీలను అభివృద్ది చెయ్యాలని నేను బలంగా నమ్ముతున్నాను. వేరే రాష్ట్రానికి చెందిన అమూల్ కంపెనీకి జగన్ వేల కోట్ల ఆస్తులు కట్టబెడుతున్నాడు. 

మాకు ఫీడ్ కంపెనీ కూడా ఉంది... కానీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మా కంపెనీ ఫీడ్ కొనాలి, హెరిటేజ్ కే పాలు పొయ్యాలి అని ఎప్పుడూ వత్తిడి చెయ్యలేదు. జగన్ మాత్రం ఒక్క అమూల్ కే పాలు అమ్మాలి అనే నిబంధన పెడుతున్నారు. గుజరాత్ కి చెందిన కంపెనీపై అంత ప్రేమ ఎందుకు? విజయ, సంగం, విశాఖ, విజయ లాంటి కోఆపరేటివ్ డెయిరీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలి అనేది టీడీపీ ఆలోచన.

2019 గాలిలో కూడా ప్రకాశం జిల్లా ప్రజలు మా గౌరవాన్ని కాపాడారు. మిమ్మలని గుండెల్లో పెట్టుకుంటాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ప్రకాశం జిల్లా యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం – 2082.9 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 12.8 కి.మీ.*

*158వరోజు (18-7-2023) యువగళం పాదయాత్ర వివరాలు:*

*కొండపి అసెంబ్లీ నియోజకవర్గం (ప్రకాశం జిల్లా)*

సాయంత్రం

4.00 – చెరుకూరివారిపాలెం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.30 – చెరువుకొమ్ముపాలెంలో పొగాకు కార్మికులతో సమావేశం.

5.00 – కె.అగ్రహారంలో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

6.45 – పరుచూరివారిపాలెంలో స్థానికులతో సమావేశం.

7.15 – కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం.

8.00 – పాలేటిగంగలో స్థానికులతో మాటామంతీ.

9.30 – పెద్దఅలవలపాడులో స్థానికులతో సమావేశం.

9.45 – పెద్దఅలవలపాడు శివారు విడిది కేంద్రంలో బస.

******


More Telugu News