దక్షిణాప్రికా పర్యటనలో ఇలాంటి వాళ్లు అవసరం: బ్యాటింగ్ కోచ్

  • డబ్ల్యుటీసీ ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారన్న కోచ్ విక్రమ్
  • జట్టుకు అవసరమైనప్పుడల్లా ఆదుకుంటూనే ఉంటాడన్న కోచ్
  • యశస్వి జైశ్వాల్‌పై ప్రశంసల వర్షం
దక్షిణాఫ్రికాలో ఆడేందుకు అజింక్యా రహానే వంటి ఆటగాళ్లు కావాలని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నారు. విదేశీ గడ్డపై సాధించిన పలు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రహానేకు డబ్ల్యుటీసీ కంటే ముందు వరకు జట్టులో చోటు దక్కలేదు. కానీ ఫైనల్లో చోటు దక్కించుకొని అద్భుత ప్రదర్శన కనబరిచారు. 

ఈ నేపథ్యంలో విక్రమ్ రాథోడ్ మాట్లాడుతూ, డబ్ల్యుటీసీ ఫైనల్లో రహానే అద్భుత ప్రదర్శన కనబరిచాడని, జట్టుకు అవసరమైనప్పుడల్లా ఆదుకుంటూనే ఉంటాడని, గతంలో ఫామ్ లో లేని కారణంగా జట్టు నుండి అతడిని తప్పించవలసి వచ్చిందని, కానీ ఎప్పటికప్పుడు తన టెక్నిక్ ను మెరుగుపరుచుకుంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చుననీ, ఇప్పుడు రహానే అదే పని చేస్తున్నాడని పేర్కొన్నారు.

పునరాగమనంలో భిన్నంగా కనిపిస్తున్నాడని, నెట్స్ లో బాగా శ్రమిస్తున్నాడన్నారు. రహానే రాణిస్తాడనే భావిస్తున్నామని, ముఖ్యంగా సౌతాఫ్రికా కండిషన్లలో ఇలాంటి ఆటగాళ్ల అవసరం ఉంటుందని వ్యాఖ్యానించారు.

అదే సమయంలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ప్రదర్శనపై బ్యాటింగ్ కోచ్ ప్రశంసలు కురిపించారు. ఆరంభ మ్యాచ్ లోనే అదరగొట్టాడని, అతని ప్రదర్శన భారత్ అద్భుత విజయానికి తోడ్పడిందన్నారు. తాను గతంలో సెలెక్టర్ గా ఉన్నానని, ఒక సెలెక్టర్ ఒక ఆటగాడిని ఎంచుకునే సమయంలో రాబోయే పదేళ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, యశస్విలో ఆ సత్తా ఉందని కితాబిచ్చారు.


More Telugu News