అనకాపల్లిలో టమాటాలతో తులాభారం మొక్కు!

  • ఖరీదైన కూరగాయల జాబితాలో చేరిన టమాటాలు
  • ఎక్కడ చూసినా కిలో రూ.100 పైనే
  • అనకాపల్లిలో టమాటాలతో కూతురికి తులాభారం వేయించిన దంపతులు
  • గుడిలో నిత్యాన్న దానం కోసం అందజేత
టమాటా.. ఇప్పుడు ఖరీదైన కూరగాయల జాబితాలో చేరిపోయింది. ఎప్పుడూ రూ.10, రూ.20 లోనే ఉండే టమాటా.. రికార్డు స్థాయి ధర పలుకుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో రూ.250కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోనూ రూ.100కు పైనే పలుకుతోంది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనకాపల్లిలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్యకు టమాటాలతో తులాభారం వేశారు. 51 కేజీల చొప్పున టమాటాలు, బెల్లం, పంచదారలతో తులాభారం వేసి మొక్కు చెల్లించుకున్నారు. బెల్లం, పంచదార, టమాటాలను గుడిలో నిత్యాన్న దానం కోసం అందజేశారు.

టమాటాల తులాభారాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. చాలా మంది బెల్లం, పంచదార, డబ్బులు వంటి వాటితో తులాభారం వేస్తారు కానీ.. ఇలా టమాటాలతో కూడా తులాభారం వేస్తారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.


More Telugu News