ప్రపంచ ఎమోజీ డే.. ఎక్కువ మంది వాడే ఎమోజీలు ఇవేనట!

  • సోషల్ మీడియాలో ఎమోజీల హవా
  • ఎన్నో రకాల ఎక్స్‌ప్రెషన్స్‌కు రూపాలు
  • మన దేశంలో ఎక్కువగా 5 ఎమోజీల వాడకం
ఎమోజీ.. మన ఫీలింగ్స్‌ను సోషల్ మీడియాలో ఎక్స్‌ప్రెస్‌ చేసేందుకు ఉపయోగించే డిజిటల్ ఇమేజ్ లేదా ఐకాన్. కోపం, బాధ, ఏడుపు, నవ్వు, సంతోషం.. ఇలా ఎన్నో రకాల ఎక్స్‌ప్రెషన్స్‌కు సంబంధించిన ఎమోజీలు ‘సోషల్’ జీవితంలో భాగమయ్యాయి. వాట్సాప్, ట్విట్టర్‌‌, ఫేస్‌బుక్.. ఇలా ప్రతి ప్లాట్‌ఫామ్‌లోనూ ఎమోజీల హవా మామూలుగా ఉండదు. ఎన్నో మాటలు చెప్పలేని అర్థాన్ని ఒక్క ఎమోజీ చెప్పేస్తుంది. అందుకే అవి అంత ప్రచుర్యం పొందాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఈరోజు ‘ప్రపంచ ఎమోజీ డే’ మరి.

వర్చువల్ ప్రపంచంలో కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడానికి ఎమోజీలను మొదట ఒక కళాకారుడు సృష్టించాడు. 1990ల్లో జపనీస్ కళాకారుడు షిగెటకా కురిటా 176 ఎమోజీల సెట్‌ను రూపొందించారు. తర్వాత 2014లో ఎమోజీపీడియా వ్యవస్థాపకుడు జెరెమీ బర్గ్.. ఎమోజీల వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో వేడుకల రోజును ప్రారంభించాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే ఏటా జులై 17న ప్రపంచ ఎమోజీ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

2022లో ‘క్రాస్ వరల్డ్ సాల్వర్’ అనే సంస్థ సర్వే చేసి.. మన దేశంలో ఎక్కువ మంది ఉపయోగించే ఎమోజీలు ఏవనేది తేల్చింది. నవ్వలేక కన్నీళ్లు వచ్చే ఎమోజీ.. రెండు చేతులతో దండం పెడుతున్న ఎమోజీ.. ఏడుస్తున్న ఎమోజీ.. ప్రాధేయపడుతున్నట్లుగా ఉండే ఎమోజీ.. థమ్స్ అప్ ఎమోజీ.. ఈ ఐదింటినీ మన దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారట. మరి మీరు ఎక్కువగా ఉపయోగించే ఎమోజీ ఏది?


More Telugu News