ఔట్ సోర్సింగ్ కు పాక్ విమానాశ్రయం!

  • విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గుతుండడంతో ప్రభుత్వ నిర్ణయం
  • మరికొన్ని విమానాశ్రయాలను కూడా వదిలించుకునేందుకు ప్రయత్నం
  • సివిల్ ఏవియేషన్ చట్టాలకు సవరణలు చేయనున్న ప్రభుత్వం
  • ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీతో మంత్రి ఇషాక్ దార్ భేటీ
దేశంలో ఫారెన్ కరెన్సీ నిల్వలు వేగంగా తగ్గిపోతుండడంతో పాకిస్థాన్ ప్రభుత్వం విమానాశ్రయాలను ఔట్ సోర్సింగ్ కు అప్పగించేందుకు ప్రయత్నిస్తోంది. నిర్వహణ భారంగా మారడం, దేశం అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత ఇస్లామాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో పాటు దేశంలోని ఇతర విమానాశ్రయాల నిర్వహణను కూడా ఔట్ సోర్సింగ్ కు ఇవ్వాలని నిర్ణయించింది.

ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ వేగంగా పనిచేస్తోంది. ఈ నెలాఖరులోగా ఇస్లామాబాద్ ఎయిర్ పోర్ట్ ను ఔట్ సోర్సింగ్ కు అప్పగించే ప్రాసెస్ ను పూర్తిచేయనున్నట్లు తెలిపింది. వచ్చే నెల 12న విమానాశ్రయం నిర్వహణ ప్రైవేటుపరం కానుందని డాన్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఈ కమిటీతో పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారని సమాచారం. తాజాగా శనివారం కూడా మంత్రి ఈ కమిటీతో భేటీ అయ్యారు.

ఇస్లామాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్వహణకు ముందుకు వచ్చే సంస్థల నుంచి త్వరలోనే బిడ్స్ ఆహ్వానించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం సివిల్ ఏవియేషన్ చట్టాలలో అవసరమైన సవరణలు చేయాలని, వీలైనంత వేగంగా ఈ ప్రాసెస్ ను పూర్తిచేయాలని సంబంధిత శాఖల అధికారులకు మంత్రి సూచించినట్లు డాన్ పత్రిక పేర్కొంది. అదేవిధంగా సివిల్ ఏవియేషన్ చట్టాలకు ప్రతిపాదించే సవరణలకు ఈ నెలాఖరులోగా పార్లమెంట్ ఆమోదం పొందాలని మంత్రి ఇషాక్ దార్ భావిస్తున్నారని తెలిపింది.


More Telugu News