ఫ్రెండ్‌తో కలిసి కాఫీ తాగుతుండగా మహిళపై పడ్డ ఉల్క

ఫ్రెండ్‌తో కలిసి కాఫీ తాగుతుండగా మహిళపై పడ్డ ఉల్క
  • తూర్పు ఫ్రాన్స్‌లోని ఆల్సేస్ ప్రాంతంలో వెలుగు చూసిన ఘటన
  •  తొలుత టెర్రస్‌ ఫ్లోర్‌పై పడిన ఉల్క ఆపై మహిళ ఛాతిని ఢీకొట్టిన వైనం
  • ఉల్క తనపై పడటంతో షాక్ కొట్టినట్టు అనిపించిందన్న మహిళ
  • ఇదో అరుదైన ఘటన అని అంటున్న శాస్త్రవేత్తలు 
  • 21వ శతాబ్దంలో ఇలా అయిదు సార్లు మాత్రమే జరిగిందని వెల్లడి
ఫ్రాన్స్‌లో గతవారం ఓ అరుదైన ఘటన వెలుగు చూసింది.  తూర్పు ఫ్రాన్స్‌లోని ఆల్సేస్ ప్రాంతంలో తన ఇంటి టెర్రస్‌పై కూర్చుని స్నేహితురాలితో కలిసి కాఫీ తాగుతున్న మహిళపై ఓ ఉల్క పడింది. ఉల్క టెర్రస్ ఫ్లోర్‌ను డీకొని ఆపై మహిళ ఛాతికి తగిలింది. తొలుత తమవైపు ఏదో దూసుకువస్తున్నట్టు శబ్దం వినిపించిందని, ఆపై ఛాతిలో విద్యుత్ షాక్ తగిలినట్టు అనిపించిందని ఆ మహిళ చెప్పుకొచ్చింది. నేలపై ఉన్న ఉల్కను చూస్తే అది సిమెంట్ రాయిలా వింత రంగులో కనిపించిందని స్థానిక మీడియాకు ఆమె తెలిపింది.  తనకు తెలిసిన జియాలజిస్టుకు దాన్ని చూపించగా అది ఉల్కేనని ఆయన స్పష్టం చేశారని పేర్కొంది. 

ఇదో అరుదైన ఘటన అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులపై ఉల్కలు పడటం బహు అరుదని, 21వ శతాబ్దంలో కేవలం అయిదు సార్లు మాత్రం ఇలా జరిగిందని అన్నారు. 1954లో తొలిసారిగా ఓ వ్యక్తిపై ఉల్క పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అలబామా రాష్ట్రానికి(అమెరికా) చెందిన ఓ మహిళ తన ఇంట్లో కూర్చుని ఉండగా ఓ ఉల్క ఇంటి సీలింగ్‌ను చిధ్రం చేసి ఆమెపై పడింది. ఈ ఘటనలో మహిళకు ఓ మోస్తరు గాయాలయ్యాయి. శరీరం పలు చోట్ల కందిపోయింది.


More Telugu News