హిందూ దేవాలయంపై రాకెట్ లాంచర్లతో దాడి.. పాకిస్థాన్‌లో దారుణం

  • సింధ్‌ ఫ్రావిన్స్ కాష్మోరే ప్రాంతంలోని హిందూ దేవాలయంపై దాడి
  • ఆదివారం తెల్లవారుజామున రాకెట్ లాంచర్లతో దాడికి తెగబడ్డ నిందితులు
  • పోలీసుల రాకతో అక్కడి నుంచి పరార్
  • రాకెట్లు పేలకపోవడంతో తప్పిన ప్రమాదం
  • నిందితుల కోసం పోలీసుల విస్తృత గాలింపు 
పాకిస్థాన్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. సింధ్ ప్రావిన్స్‌లోని కాష్మోరే ప్రాంతంలోగల ఓ హిందూ దేవాలయంపై కొందరు దోపిడీదారులు రాకెట్ లాంచర్లతో దాడికి తెగబడ్డారు. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా వారు రాకెట్‌లను ప్రయోగించి స్థానికంగా కలకలం రేకెత్తించారు. అయితే, రాకెట్లేవీ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో దోపిడీదారులు పరారయ్యారు. స్థానికంగా నివసించే బాగ్రీ వర్గం వారు ఏటా ఈ గుడిలో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 

సుమారు తొమ్మిది మంది ఈ దాడికి పాల్పడినట్టు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఇష్టారీతిన కాల్పులకు తెగబడిన వారు పోలీసుల రాకను గుర్తించి పరారయ్యారన్నారు. నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. 

పాకిస్థాన్‌కు చెందిన వివాహిత సీమా హైదర్ జఖ్రానీ భారత్‌లోని ఓ హిందూవ్యక్తితో ప్రేమలో పడి దేశం విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌లోని హిందువులపై బెదిరింపులు అధికమయ్యాయి. కాష్మోరే, ఘోట్కీ ప్రాంతాల్లోని హిందూ దేవాలయాలను లక్ష్యం చేసుకుంటామంటూ కొందరు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.


More Telugu News