నరసరావుపేటలో టీడీపీ నేత ఇంట్లోకి చొరబడి దాడి చేయడం దారుణం: ప్రత్తిపాటి

  • నరసరావుపేటలో ఉద్రిక్తతలు
  • టీడీపీ నేత చల్లా సుబ్బారావు నివాసంపై దాడి
  • టీడీపీ, వైసీపీ నేతల మధ్య నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణం 
  • టీడీపీ ఇన్చార్జి అరవింద్ బాబు, టీడీపీ నేత కడియాల రమేశ్ ల వాహనాలు ధ్వంసం
  • అరవింద్ బాబు డ్రైవర్ తలకు తీవ్రగాయం!
ఇవాళ పల్నాడు జిల్లా నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. టీడీపీ నేత చల్లా సుబ్బారావు నివాసంపై వైసీపీ నేతలు దాడి చేశారంటూ టీడీపీ శ్రేణులు కదం తొక్కాయి. ఈ నేపథ్యంలో, టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. 

అక్కడికి నరసరావుపేట టీడీపీ ఇన్చార్జి చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ నేత కడియాల రమేశ్ రాగా, వారి వాహనాల పైనా దాడి జరిగింది. ఈ ఘటనల్లో ఓ పోలీసు జీపు కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. రాళ్లదాడిలో అరవింద్ బాబు డ్రైవర్ తలకు తీవ్ర గాయమైంది. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడికి రావడంతో, ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 

దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. నరసరావుపేటలో వైసీపీ నేతల దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ నేత చల్లా సుబ్బారావు ఇంట్లోకి చొరబడి ధ్వంసం చేయడం దారుణమని పేర్కొన్నారు. నిన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై చల్లా సుబ్బారావు విమర్శలు చేయడమే నేటి పరిణామాలకు కారణమని భావిస్తున్నారు.


More Telugu News