శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటివరకు రూ.880 కోట్ల విరాళాలు వచ్చాయి: టీటీడీ

  • డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించిన టీటీడీ
  • ప్రజల ప్రశ్నలకు జవాబిచ్చిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
  • శ్రీవాణి ట్రస్టుపై ప్రశ్నించిన చెన్నైకి చెందిన వెంకటేశ్, మంచిర్యాలకు చెందిన శ్రీకాంత్ 
తిరుమల అన్నమయ్య భవన్ లో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ప్రశ్నలకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి జవాబిచ్చారు. తిరుమల శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటివరకు రూ.880 కోట్ల విరాళాలు వచ్చాయని వెల్లడించారు. దాదాపు 9 లక్షల మంది భక్తుల నుంచి ఈ విరాళాలు అందాయని చెప్పారు. 

శ్రీవాణి ట్రస్టు నిధులతో 2,500 ఆలయాల నిర్మాణానికి, పునరుద్ధరణకు ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. ధూపదీప నైవేద్యాల కోసం ఒక్కో ఆలయానికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున ఇస్తున్నామని వివరించారు. 

ఇటీవల శ్రీవాణి ట్రస్టు నిధులపై కొందరు అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులు దారిమళ్లుతున్నాయన్న వ్యాఖ్యల్లో నిజంలేదని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. నిధుల దుర్వినియోగం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధుల వ్యవహారంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 

చెన్నైకి చెందిన వెంకటేశ్, మంచిర్యాలకు చెందిన శ్రీకాంత్ అనే భక్తులు అడిగిన ప్రశ్నలకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి పైవిధంగా సమాధానమిచ్చారు.


More Telugu News