'సురక్ష' ప్రజల పాలిట శని అని పేర్ని నాని గారే తేల్చేశారు: నారా లోకేశ్

  • కందుకూరు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • వలేటివారిపాలెంలో భారీ బహిరంగ సభ
  • జగన్ ప్రతి స్కీం వెనుక స్కాం ఉంటుందన్న లోకేశ్
  • గజదొంగ జగన్ ఇప్పుడు డేటా దొంగ అవతారం ఎత్తాడని విమర్శలు
  • ఉమ్మడి ప్రకాశం జిల్లాను గుండెల్లో పెట్టుకుంటామని వెల్లడి
ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. వలేటివారిపాలెంలో ఈ సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభకు జనం పోటెత్తారు. ఈ సభలో లోకేశ్ ఉత్సాహపూరితంగా ప్రసంగించారు. 

కందుకూరు కదం తొక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. రాజుల రాజధాని ఈ స్కందపురి. జనార్దనస్వామి ఆలయం, స్కంధపురి సోమేశ్వర ఆలయం, శ్రీ మాల్యాద్రి నరసింహ స్వామి ఆలయం ఉన్న పుణ్య భూమి కందుకూరు అని అభివర్ణించారు. కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు మామిడి ప్రపంచం మొత్తం ఫేమస్ అని తెలిపారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కందుకూరు నేలపై పాదయాత్ర చెయ్యడం తన అదృష్టం అని పేర్కొన్నారు. కందుకూరును అభివృద్ధి చేసింది టీడీపీ అని లోకేశ్ స్పష్టం చేశారు. 

ఇవాళ జనసందోహంతో ప్రకాశం పోటెత్తింది... జనం లేరన్నారు... ప్రభంజనం చూసి వైసీపీ వాళ్లు ప్యాంట్లు తడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. యువగళం దెబ్బకి వైసీపీ ప్యాకప్ ఖాయమని అన్నారు. తన ప్రసంగంలో సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 

జగన్ ప్రతి స్కీం వెనకా ఒక స్కాం ఉంటుంది

సురక్ష అనగానే నాకు డౌట్ వచ్చింది. అది సురక్ష కాదు ప్రజల పాలిట శని అని మాజీ మంత్రి పేర్ని నాని గారే తేల్చేశారు. గజదొంగ జగన్ ఇప్పుడు డేటా దొంగ అవతారం కూడా ఎత్తాడు. క్యాబినెట్ సమావేశం రోజు మాజీ మంత్రి పేర్ని నాని సచివాలయానికి వచ్చారు. అక్కడ ఉన్న మీడియా మిత్రులతో మాట్లాడారు. 

ఆ సందర్భంలో మీడియా మిత్రులు సురక్ష కార్యక్రమంలో వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు, ఫింగర్ ప్రింట్ తో పాటు, ఏ పార్టీకి చెందిన వారు? సాక్షికి అనుకూలమా? కాదా అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు అని చెప్పారు. పాపం ఆయన "నో నో" అలా జరిగే ప్రసక్తే లేదు అంటూ వాలంటీర్ వాసుకు కాల్ కొట్టి లైవ్ లో నిరూపిస్తా అన్నాడు. 

ఫోన్ చేసి వాలంటీర్ ని... మీరు పార్టీ వివరాలు, వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారా? ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారా? అని అడిగారు. వెంటనే ఆ వాలంటీర్... అవును సార్ ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నాం, సాక్షికి , వైసీపీకి అనుకూలమా కాదా అని కూడా వివరాలు సేకరిస్తున్నాం అని చెప్పేశాడు. పాపం ఆ పిల్లాడికి ఆ ఫోన్ స్పీకర్ లో ఉందని తెలియదు. మీడియా వాళ్లు పక్కనే ఉండడంతో ఈయన ఫోన్ కట్ చేయలేదు. ఆ విధంగా దొరికిపోయారు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లాను గుండెల్లో పెట్టుకుంటాం

ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు 2019లో టీడీపీ గౌరవాన్ని నిలబెట్టారు. 4 సీట్లు గెలిపించారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లాని గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాం. 

2019 లో వైసీపీ 8 సీట్లు గెలిచింది. టీడీపీ ఎమ్మెల్యేని కూడా పార్టీలో చేర్చుకున్నారు. మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే జిల్లా ఎలా అభివృద్ధి చెందాలి? అభివృద్ధిలో దూసుకెళ్ళాలి... నంబర్ 1 గా ఉండాలి. కానీ, ఉమ్మడి ప్రకాశం జిల్లాకి జగన్ పీకింది ఏంటి?

వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. పూర్తి చేశాడా? ఆరుసార్లు తేదీలు మార్చాడు. నడికుడి - కాళహస్తి రైల్వే పనులు పూర్తి అయ్యాయా? నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం టీడీపీ హయాంలో భూసేకరణ చేశాం. ఆ ప్రాజెక్ట్ వెళ్లిపోయింది. 

రాయల్టీ, కరెంట్ ఛార్జీలు, పన్నులు పెంచి గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీశాడు. గుండ్లకమ్మ ప్రాజెక్టును నాశనం చేశాడు. గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టులోని నీరు మొత్తం ఖాళీ చేశారు. జగన్ అసమర్ధత కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది.

కందుకూరులో పసుపు జెండా ఎగిరి 25 ఏళ్లయింది

కందుకూరుని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తారని మీరు వైసీపీని గెలిపించారు. కందుకూరులో అభివృద్ది అడ్రస్ లేకుండా పోయింది. కందుకూరుకి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. రాళ్లపాడు ప్రాజెక్టు ఎడమ కాలువ అభివృద్ధి చేస్తామని చెప్పి చెయ్యలేదు. కందుకూరుకు బైపాస్ నిర్మాణం చేస్తామని చెప్పి చెయ్యలేదు. 

ఉలవపాడు మామిడి రైతులకి అనేక హామీలు ఇచ్చాడు. ఒక్కటీ నిలబెట్టుకోలేదు. ఇచ్చిన హామీలు ఎందుకు నిలబెట్టుకోలేదు అని ఎమ్మెల్యే గారు కనీసం ప్రశ్నించలేదు. 

కందుకూరులో పసుపు జెండా ఎగిరి 25 ఏళ్లు అయ్యింది. కందుకూరులో టీడీపీని గెలిపించండి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతాం. 

రామాయపట్నం పోర్ట్ పూర్తి చేస్తాం. పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పేపర్ మిల్ పరిశ్రమ ఏర్పాటు చేసి సుబాబుల్, జామాయిల్ రైతులను ఆదుకుంటాం. రాళ్లపాడు ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం. మామిడి, సపోటా రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. మార్కెటింగ్ అవకాశంతో పాటు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తాం.


More Telugu News