రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అసలైన వారసుడిలా తయారయ్యారు: హరీశ్ రావు

  • ఉచిత విద్యుత్ అంశంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
  • భగ్గుమంటున్న బీఆర్ఎస్ మంత్రులు
  • 3 గంటల కరెంటు ఎలా సరిపోతుందో రేవంత్ చెప్పాలన్న హరీశ్
  • ఉచిత విద్యుత్ పై చర్చ జరిగితే బీఆర్ఎస్ కే లాభమని వెల్లడి
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఉచిత విద్యుత్ అంశంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నేతలు కారాలుమిరియాలు నూరుతున్నారు. తాజాగా, వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కూడా రేవంత్ పై ధ్వజమెత్తారు. 

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎకరం పొలానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని అంటున్నాడని, అది ఎలా సరిపోతుందో ఆయనే చెప్పాలని అన్నారు. నాడు వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలంటూ చంద్రబాబుకు అసలైన వారసుడిలా తయారయ్యారని హరీశ్ రావు విమర్శించారు. 

ఉచిత విద్యుత్ పై ఎంత చర్చ జరిగితే బీఆర్ఎస్ పార్టీకి అంత మేలు జరుగుతుందని అన్నారు. 3 గంటల కరెంటు కావాలో, 24 గంటల కరెంటు కావాలో రైతులకు తెలుసని స్పష్టం చేశారు. 

నాడు కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎలా ఉందో, నేడు బీఆర్ఎస్ పాలనలో కరెంటు ఎలా ఉందో తెలంగాణ ప్రజానీకం ఆలోచించాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా 24 గంటల కరెంటు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.


More Telugu News