వాలంటీర్ల జోలికొస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్‌కు ఆళ్ల నాని హెచ్చరికలు
- వాలంటీర్ల వ్యవస్థపై పవన్, చంద్రబాబు విషం చిమ్ముతున్నారన్న ఆళ్ల నాని
- పవన్ కల్యాణ్ అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు
- లేదంటే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరిక
వాలంటీర్ల వ్యవస్థను కూలదోయటానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నీచానికి దిగజారారని మాజీ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. వాలంటీర్ల జోలికి వచ్చినా, దూషణలు చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏలూరులో ఆదివారం ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్, చంద్రబాబు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
‘‘పేదలకు సంక్షేమ పథకాలను అందించటానికి, అవినీతి లేకుండా పారదర్శకంగా ఉండేందుకు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఒక్క పథకాన్నీ పేదవారు కోల్పోకూడదని జగన్ ఈ వ్యవస్థను తీసుకువచ్చారు” అని ఆళ్ల నాని వివరించారు.
‘‘సీఎం జగన్‌పై ఎన్నో అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తున్నారు. దూషణల ద్వారా ప్రజల్లో చులకన చేయాలని, అప్రతిష్ఠపాలు చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుట్రలు పన్నారు. అవి ఫలించకపోవడంతో వాలంటీర్లపై అసత్య ప్రచారం చేస్తున్నారు” అని మాజీ మంత్రి మండిపడ్డారు.
‘‘మహిళల అక్రమ రవాణాకి వాలంటీర్లే కారణమని ఏలూరు సభలో పవన్ మాట్లాడారు. అసలు వాలంటీర్లకు, మహిళల అక్రమ రవాణాకి సంబంధం ఏమిటి పవన్ కల్యాణ్? చంద్రబాబు నీచమైన స్క్రిప్ట్ రాసి ఇస్తే.. కనీసం మానవత్వం లేకుండా మాట్లాడడం మనుషులు చేసే పనేనా ఇది?” అని పవన్‌పై విరుచుకుపడ్డారు. పవన్ అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేదంటే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు.