ఖాళీగా తిరుగుతున్న డబుల్ డెక్కర్ బస్సులు.. కారణం ఏంటంటే!

  • ఉచితంగా తిప్పుతున్నా ఎవ్వరూ ఎక్కట్లేదట
  • ఏ రూట్ లో తిరుగుతాయో తెలియకనే ఆదరణ కరువు
  • ప్రస్తుతం ఆరు బస్సులను తిప్పుతున్న హెచ్ఎండీఏ
హైదరాబాద్ వాసుల కోరిక మేరకు హెచ్ఎండీఏ తీసుకొచ్చిన డబుల్ డెక్కర్ బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. సిటీలో పర్యాటకానికి ఊతమిచ్చేలా.. అలనాటి డబుల్ డెక్కర్ ప్రయాణాన్ని నగరవాసులకు మళ్లీ పరిచయం చేసేందుకు ఆరు డబుల్ డెక్కర్ బస్సులను నడిపిస్తోంది. తొలుత వాటిని ప్రజలకు పరిచయం చేయడం కోసం జాయ్ రైడ్ పేరుతో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది.

ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ ఏరియాలో రెండు బస్సులను ఫ్రీగా తిప్పుతోంది. అయితే, ఈ బస్సులకు ఆదరణ కరువైందని, ప్రయాణికులు ఎక్కడంలేదని సమాచారం. బస్సులు తిరిగే రూట్లు, సమయాలకు సంబంధించిన వివరాలపై స్పష్టత లేకపోవడం వల్ల బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయని తెలుస్తోంది.

సిటీలో ఆరు డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. ఇందులో రెండు ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, సంజీవయ్య పార్క్ ఏరియాల్లో కనిపిస్తుండగా.. మిగతా నాలుగు బస్సులు ఏ రూట్ లో ఎక్కడి నుంచి ఎక్కిడికి తిరుగుతున్నాయనే సమాచారం లేదు. మరోవైపు, ఈ బస్సులను హెచ్ఎండీఏ రూ.12 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. నిర్వహణ కోసం నెలనెలా రూ.4 లక్షల దాకా ఖర్చు చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలన్న హెచ్ఎండీఏ ప్రయత్నం కుదిరేలా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బస్సులకు సబంధించి ప్రచారం, రూట్ల వివరాలు, సమయాలపై ప్రచారం చేస్తే ప్రజల ఆదరణ లభిస్తుందని పలువురు సూచిస్తున్నారు.


More Telugu News