ఏసీలు, కూలర్లు వాడితే విద్యుత్ బిల్లు పెరగదా?.. వైసీపీ ఎమ్మెల్యే

  • విద్యుత్ బిల్లు ఎక్కువ వస్తోందంటూ మహిళ ఆవేదన
  • వ్యంగ్యంగా జవాబిచ్చిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
  • జగనన్న సురక్ష కార్యక్రమంలో మహిళపై ఎమ్మెల్యే చిరాకు
విద్యుత్ బిల్లు ఎక్కువ వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఓ మహిళపై శ్రీశైలం ఎమ్మెల్యే చిరాకు ప్రదర్శించారు. ఏసీలు, కూలర్లు వాడితే బిల్లు ఎక్కువ రాదా అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఎమ్మెల్యే తీరుతో జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరైన జనం విస్తుపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని బండిఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో శనివారం చోటుచేసుకుందీ ఘటన.

జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు జనంలోకి వెళుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఈర్నపాడులో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఓ మహిళ లేచి నిలబడి ఇటీవల తన ఇంటికి విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తోందని వాపోయారు. గతంలో రూ.200 లోపు వచ్చే బిల్లు ఇటీవలి కాలంలో రూ.600 నుంచి రూ.800 వరకు వస్తోందని, బిల్లు కట్టడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో చిరాకు పడ్డ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలతో ఏసీలు, కూలర్లు కొంటున్నారని, వాటిని వాడడం వల్లే విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తోందని వ్యంగ్యంగా జవాబిచ్చారు. అయితే, అలాంటి వస్తువులు ఏవీ తన ఇంట్లో లేవని, అయినా బిల్లు ఎక్కువే వస్తోందని సదరు మహిళ వాపోయారు. ఇంతలో మిగతా గ్రామస్థులు కూడా తమ సమస్యలు ఏకరువు పెట్టేందుకు ప్రయత్నించగా.. ఎమ్మెల్యే వారిని అడ్డుకుని చిరాకు ప్రదర్శించారు. ఎమ్మెల్యే తీరును చూసి జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరైన జనం విస్తుపోయారు.


More Telugu News