అమెరికా, జపాన్, యూరప్‌లో విరుచుకుపడుతున్న భానుడు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

  • కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు వేడి గాలులు
  • రివర్‌సైడ్ కౌంటీలో 3 వేలకుపైగా ఎకరాల్లో కార్చిచ్చు
  • ఇటలీలోని 16 రాష్ట్రాలలో రెడ్ అలెర్ట్
  • రోమ్‌లో 2007 నాటి అధిక ఉష్ణోగ్రత రికార్డు బద్దలు
  • జపాన్‌లో రేపటికల్లా 39 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకునే అవకాశం
ఇండియాలో వరుణుడు విశ్వరూపం చూపిస్తుంటే అమెరికా, జపాన్, యూరప్‌లో భానుడు చెలరేగిపోతున్నాడు. సూరీడు నిప్పులు చెరుగుతుండడంతో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గ్లోబల్ వార్మింగ్‌కు నిదర్శనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు వేడి గాలులు వీస్తున్నాయి. సాధారణం కంటే 10 నుంచి 20 డిగ్రీల ఫారెన్‌హీట్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. యూఎస్‌లోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చులు కలవరపెడుతున్నాయి. రివర్‌సైడ్ కౌంటీలో 3వేలకు పైగా ఎకరాల్లో కార్చిచ్చు రేగింది. దీంతో అక్కడి నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  

ఇటలీ కూడా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతోంది. రోమ్, బొలోగ్నా, ఫ్లోరెన్స్ సహా 16 రాష్ట్రాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఇక్కడ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 2007లో రోమ్‌లో 40.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కాగా, మంగళవారం 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదై పాత రికార్డును చెరిపేసింది.  ఫ్రాన్స్‌లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. జపాన్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. రేపటికల్లా అక్కడి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెంటీగ్రేడ్‌లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


More Telugu News