టీడీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై తప్పుడు కేసులు ఎత్తేస్తాం: లోకేశ్

  • ఉదయగిరి నియోజకవర్గంలో ముగిసిన లోకేశ్ పాదయాత్ర
  • కందుకూరు నియోజకవర్గంలోకి యువగళం ఎంట్రీ
  • లోకేశ్ ను కలిసిన పలు గ్రామాల ప్రజలు
  • టీడీపీ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని హామీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ప్రవేశించింది. లోకేశ్ కు స్థానిక నాయకత్వం అత్యంత ఘనంగా స్వాగతం పలికింది. అంతకుముందు, ఉదయగిరి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర ముగిసింది. ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర సందర్భంగా లోకేశ్ ను పలు గ్రామాల ప్రజలు, వివిధ వర్గాలకు చెందినవారు కలిసి తమ సమస్యలు విన్నవించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేయాలని కోరారు. అందరి విజ్ఞప్తులు సానుకూలంగా విన్న లోకేశ్... తాము అధికారంలోకి వచ్చాక కచ్చితంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

ఉదయగిరి నియోజకవర్గంలో లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...

  • జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామీణాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. తాగునీరు, డ్రైనేజీ, కరెంటు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. పంచాయతీలకు చెందిన రూ.9 వేల కోట్లను జగన్ ప్రభుత్వం దారి మళ్లించింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తాం, కరెంటు సమస్యలు పరిష్కరిస్తాం. ప్రతిఇంటికీ తాగునీటి కుళాయి అందజేసి, 24/7 స్వచ్చమైన నీరు అందజేస్తాం.
  • సంక్షేమ కార్యక్రమాలకు లక్షల కోట్లు ఖర్చుపెడుతున్నామని డబ్బాలు కొట్టుకుంటున్న ముఖ్యమంత్రి... గ్రామీణ ప్రాంతాల్లో గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోవడం దారుణం. గత నాలుగేళ్లుగా మైనారిటీల సంక్షేమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటుచేసి ముస్లింలకు స్వయం ఉపాధి రుణాలను అందజేస్తాం.
  • చిన్ననీటి వనరులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. గత నాలుగేళ్లుగా గ్రామీణరోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. గత టీడీపీ హయాంలో చిన్ననీటి వనరుల అభివృద్ధికి నీరు-ప్రగతి కింద రూ.18,265 కోట్లు ఖర్చుచేశాం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణరోడ్లు, పుంతరోడ్ల నిర్మాణం చేపడతాం. రేణమాల చెరువుకు సాగునీరు అందజేసి, రైతుల కష్టాలు తొలగిస్తాం.

కందుకూరు నియోజకవర్గంలో లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్

  • జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. జగన్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య డ్యామ్, పులిచింతల గేట్లు, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. గత టీడీపీ హయాంలో ఇరిగేషన్ పై రూ.68,294 కోట్లు ఖర్చుచేశాం. చిన్ననీటి వనరుల అభివృద్ధికి నీరు-ప్రగతి కింధ 18,265 కోట్లు వెచ్చించాం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాళ్లపాడు రిజర్వాయర్ ఎడమకాల్వ గేట్ల నిర్మాణం చేపడతాం. రాష్ట్రవ్యాప్తంగా కాల్వల మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టి రైతుల కష్టాలు తీరుస్తాం.
  • రాష్ట్రంలో దళితులపై తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. ఏపీ చరిత్రలో తొలిసారిగా దళితుల భూమి విస్తీర్ణం తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. దళితులకు చెందిన 12 వేల ఎకరాల ఎసైన్డ్ భూములను జగన్ ప్రభుత్వం బలవంతంగా లాగేసుకుంది. దళితులకు చెందాల్సిన రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి తీరని అన్యాయం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లింగసముద్రం దళితుల భూమిని వారికి అప్పగించేలా చర్యలు తీసుకుంటాం. దళితులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేస్తాం. దళితులను పనిగట్టుకుని వేధించిన పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం.
  • జగన్ అండ్ కోకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప రైతుల సమస్యలపై శ్రద్ధలేదు. రైతుల కోసం గత ప్రభుత్వంలో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు కరెంటు బిల్లులు కట్టలేక మూలనబెట్టిన దివాలాకోరు ప్రభుత్వమిది. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాళ్లపాడు ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపడతాం. లిఫ్ట్ ద్వారా సమీప గ్రామాల చెరువులకు నీరందించే అంశాన్ని పరిశీలిస్తాం. నీరులేక రైతుల పొలాలు ఎండిపోయే పరిస్థితులను రానీయం, ప్రతిఎకరాకు సాగునీరు అందిస్తాం.
  • జగన్ ప్రభుత్వం కాపులు, బలిజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. గత ప్రభుత్వంలో మంజూరుచేసిన కాపు, బలిజల కమ్యూనిటీ హాళ్లను కూడా ఈ ప్రభుత్వం నిలిపివేసింది. జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధుల్లేని దుస్థితి కల్పించారు. టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల కి.మీ.ల సీసీ రోడ్లు, 30 లక్షల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశాం. మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం – 2057.3 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 17.9 కి.మీ.*

*156వరోజు (16-7-2023) యువగళం పాదయాత్ర వివరాలు:*

*కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి ప్రకాశం జిల్లా)*

సాయంత్రం

3.00 – వెంగళాపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.20 – బంగారక్కపాలెంలో ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.

4.50 – వలేటివారిపాలెంలో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

6.50 – లింగపాలెంలో స్థానికులతో మాటామంతీ.

7.30 – రామచంద్రాపురంలో స్థానికులతో సమావేశం.

8.00 – కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం.

8.10 – మాలెపాడు విడిదికేంద్రంలో బస.

******


More Telugu News