ఏపీకి వర్ష సూచన!

  • వచ్చే రెండు, మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
  • పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వెల్లడి
  • 17, 18 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటన
కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిన వానలకు వరదలు పోటెత్తుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్దగా వర్షాలు పడటం లేదు. అక్కడక్కడా ఓ మోస్తరుగా కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో చినుకు జాడ కోసం రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అప్‌డేట్ ఇచ్చారు. ఏపీలో వచ్చే రెండు, మూడు రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. బంగాళాఖాతంలో 17, 18 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ వర్షాలు నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. 

ప్రస్తుతం ఉత్తరాంధ్రలో రెండు మూడు రోజులుగా వానలు పడుతున్నాయి. ఏలూరు జిల్లా ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. కోనసీమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, మరికొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


More Telugu News