రూ.20 నోట్లు ఎరవేసి 10 లక్షలు చోరీ.. గుంటూరులో ఘరానా దోపిడీ

  • లక్ష్మీపురం హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ముందు ఘటన
  • ఎమ్ఎన్ ఎక్స్ పోర్ట్ కంపెనీ గుమాస్తాకు టోకరా
  • నోట్లు కిందపడిపోయాయని చెప్పి బ్యాగు ఎత్తుకెళ్లిన దొంగలు
బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి తీసుకెళ్లడానికి వచ్చిన గుమాస్తాకు దొంగలు టోకరా వేశారు. బైక్ దగ్గర రూ.20 నోట్లు పడిపోయాయని చెప్పి బైక్ పై పెట్టిన రూ.10 లక్షల క్యాష్ ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. వెంటనే తేరుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఇద్దరు అనుమానితులను గుర్తించారు. ఈ చోరీ తమిళనాడు దొంగల పనేనని పోలీసులు భావిస్తున్నారు. 

బ్రాడిపేటలోని ఎమ్ఎన్ ఎక్స్ పోర్టు కంపెనీలో పదేళ్లుగా హరిబాబు గుమాస్తాగా పనిచేస్తున్నాడు. శుక్రవారం యజమాని సూచనలతో బ్యాంకు నుంచి రూ.10 లక్షలు విత్ డ్రా చేసి తీసుకొచ్చేందుకు లక్ష్మీపురం హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుకు వెళ్లాడు. లోపలికి వెళ్లి నగదు తీసుకుని బయటకు వచ్చేంత వరకూ అంతా బాగానే జరిగింది. బైక్ పై కూర్చుని స్టార్ట్ చేసే సమయంలో ఓ ఆగంతుకుడు హరిబాబును ఆపాడు. బైక్ కింద నోట్లు పడిపోయాయని చూపించాడు. 

దీంతో కింద కనిపించిన రూ.20 నోట్లను ఏరుకునేందుకు హరిబాబు బైక్ పై నుంచి దిగడంతో రూ.10 లక్షల నగదు ఉన్న బ్యాగును ఆగంతుకుడు ఎత్తుకెళ్లాడు. అక్కడికి కొంత దూరంలో బైక్ పై వేచి ఉన్న తోడు దొంగతో కలిసి పారిపోయాడు. ఇది గమనించి హరిబాబు కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు అలర్ట్ అయ్యారు. అయితే, అప్పటికే దొంగలు మాయమయ్యారు. చేసేదేంలేక హరిబాబు పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పట్టాభిపురం పోలీసులు బ్యాంక్ తో పాటు బయట ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. బ్యాంకు లోపల ముగ్గురు వ్యక్తులు మాస్క్ లు పెట్టుకుని మిగతా వారిని గమనిస్తున్నట్లు ఫుటేజీలో బయటపడింది. ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసే వారిని జాగ్రత్తగా పరిశీలించినట్లు కనిపించింది. దీంతో ఆ ముగ్గురే హరిబాబు దగ్గరి నుంచి బ్యాగ్ ఎత్తుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ తరహా నేరాలు చేయడంలో తమిళనాడు గ్యాంగ్స్ సిద్ధహస్తులని, వారే ఈ దోపిడికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. దొంగల కోసం సిటీలో గాలిస్తున్నట్లు వివరించారు.


More Telugu News