ఫ్రాన్స్ అధ్యక్షుడి అర్ధాంగికి పోచంపల్లి చీర!
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు సితార వాయిద్యాన్ని కానుకగా ఇచ్చిన మోదీ
- బ్రిగెట్టి మేక్రాన్‌కు పోచంపల్లి చీరను చందనం పెట్టెలో పెట్టి బహూకరించిన ప్రధాని
- ఫ్రాన్స్ ప్రధాని సహా మరికొందరికి కూడా బహుమతులు
ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అందజేశారు. పారిస్‌లో అట్టహాసంగా జరిగిన బాస్టీల్ డే పరేడ్ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు.
తన పర్యటనను ముగించుకుని వస్తున్న సందర్భంగా మేక్రాన్ దంపతులకు ప్రధాని బహుమతులను అందజేశారు. మేక్రాన్‌కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని కానుకగా ఇచ్చారు. సరస్వతీ దేవి, జాతీయ పక్షి నెమలితో పాటు గణేశుని ప్రతిరూపాలు ఆ సితార్‌పై ఉన్నాయి.
ఇక ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగెట్టి మేక్రాన్‌కు తెలంగాణకు చెందిన ‘పోచంపల్లి సిల్క్ ఇక్కత్’ చీరను ప్రధాని మోదీ బహుకరించారు. చీరను చందనం పెట్టెలో పెట్టి ఆమెకు అందించారు. ఈ చందనం పెట్టెపైనా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు చెక్కారు.
మరోవైపు ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్‌కు మార్బుల్ టేబుల్‌ను బహుమతిగా మోదీ అందజేశారు. ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యాయిల్ బ్రౌన్ పివెట్‌కు చేతితో అల్లిన సిల్క్ కశ్మీరీ కార్పెట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఫ్రెంచ్ సెనేట్ ప్రెసిడెంట్ గెరార్డ్ లార్చర్‌కు గంధపు చెక్కతో చెక్కిన అంబారి ఏనుగు ప్రతిమను ఇచ్చారు.