36 ఏళ్లలో 35వసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్.. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన నొవాక్ జొకోవిచ్

  • వింబుల్డన్‌లో ఫైనల్ చేరిన జొకోవిచ్
  • రేపు ప్రపంచ నం.1 అల్కరాజ్‌తో అమీతుమీ
  • మరో సెమీస్‌లో మెద్వెదెవ్‌పై గెలిచిన అల్కరాజ్
పురుషుల టెన్నిస్‌లో సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ జైత్రయాత్ర నడుస్తోంది. ఇప్పటికే ఎవ్వరికీ సాధ్యంకాని రీతిలో 23 గ్రాండ్ స్లామ్స్ నెగ్గిన నొవాక్ 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ కు అడుగు దూరంలో నిలిచాడు. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ లో ఫైనల్ చేరాడు. 36 ఏళ్ల వయసులో జొకోవిచ్‌ రికార్డు స్థాయిలో 35వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. తద్వారా అమెరికా దిగ్గజం క్రిస్‌ ఎవర్ట్‌ (34)  పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. సెమీఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6-3, 6-4, 7-6 (4)తో ఎనిమిదో సీడ్‌, ఇటలీకి చెందిన జానిక్‌ సినర్‌ ను వరుస సెట్లలో చిత్తు చేశాడు. 

ఆదివారం జరిగే బ్లాక్ బస్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ గార్ఫియాతో నొవాక్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. రెండో సెమీస్‌లో 20 ఏళ్ల అల్కరాజ్ (స్పెయిన్‌) 6-3, 6-3, 6-3తో వరుస సెట్లలో మూడో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై గెలుపొంది తొలిసారి వింబుల్డన్‌ ఫైనల్‌ కు అర్హత సాధించాడు. ఫైనల్లో నొవాక్ జొకోవిచ్ గెలిస్తే వింబుల్డన్‌ను ఎనిమిది సార్లు నెగ్గిన ఆటగాడిగా స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ రికార్డును సమం చేస్తాడు.


More Telugu News