ఏపీ గవర్నర్‌‌ను కలిసిన నారా లోకేశ్

  • రాష్ట్రంలో గంజాయి సరఫరాపై గవర్నర్‌‌కు లోకేశ్ ఫిర్యాదు
  • ఏపీలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోందని వెల్లడి
  • డ్రగ్స్‌ సరఫరాలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్న డీఆర్‌ఐ నివేదిక అందజేత
  • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఏపీలో విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోందని రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఫిర్యాదు చేశారు. ఈ రోజు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను లోకేశ్‌ కలిశారు. డ్రగ్స్‌ సరఫరాలో ఏపీ అగ్రస్థానంలో ఉందని చెబుతున్న డీఆర్‌ఐ నివేదికను అందజేశారు.

దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆ మూలాలు ఏపీకి ముడిపడి ఉన్నాయని.. డ్రగ్స్‌ కేంద్రంగా రాష్ట్రం మారుతోందంటూ వివరించారు. హవాలా లావాదేవీలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

తర్వాత నారా లోకేశ్‌ మాట్లాడుతూ.. వైసీపీ నేతల ప్రమేయంతోనే రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరా జరుగుతోందని ఆరోపించారు. డ్రగ్స్‌ ఉత్పత్తి, స్మగ్లింగ్‌లో పట్టుబడిన వారిలో వైసీపీ నేతలే ఉన్నారని చెప్పారు. గత నాలుగేళ్లలో యువత మత్తులో దాడులు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయని, విద్యార్థులపైనా ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు.


More Telugu News