హర్యానా నీటిని మళ్లించడం వల్లే ఢిల్లీలో వరదలు: ఆప్

  • హాతినికుండ్ బ్యారేజ్ నుంచి ఢిల్లీ వైపు నీటిని మళ్లిస్తోందని ఆరోపణ
  • యమునా నది నీటిమట్టం పెరగడానికి కారణం అదేనని ఎంపీ సంజయ్ సింగ్ విమర్శ
  • ఆప్ నేతల విమర్శలను తిప్పికొట్టిన హర్యానా ప్రభుత్వ సలహాదారు
‘ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు రోజులుగా వర్షాలే లేవు.. అయినా యమునా నది నీటిమట్టం తగ్గకపోగా పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. దీనికి కారణం హర్యానా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటిని మళ్లించడమే’ అని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఢిల్లీ సర్కారును బదనాం చేయడానికే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హాతికుండ్ బ్యారేజ్ నుంచి నీటిని వదులుతోందని ఆప్ నేతలు విమర్శించారు.

హాతికుండ్ బ్యారేజీకి మూడు కెనాల్స్ ఉన్నాయని, ఒక కాలువకు నీళ్లు వదిలితే ఉత్తరప్రదేశ్ కు వెళతాయని, మరోదాంట్లో నుంచి ఢిల్లీకి, మూడో కాలువ నుంచి హర్యానాకు నీళ్లు వదలవచ్చని ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. అయితే, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఢిల్లీ సర్కారును ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో మిగతా రెండు కాలువలను మూసేసి యమునా నదిలోకి నీటిని వదులుతోందని మండిపడ్డారు. మూడు కాలువలను తెరిచి నీటిని వదిలితే ఢిల్లీలో ఈ స్థాయిలో వరదలు వచ్చేవి కావని చెప్పారు.

అయితే, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణలను హర్యానా ప్రభుత్వం ఖండించింది. ప్రభుత్వం తరఫున సమాచార శాఖ ట్విట్టర్ లో జవాబిచ్చింది. ఆప్ ప్రభుత్వ ఆరోపణలు ప్రజలను తప్పుదోవపట్టించేలా ఉన్నాయని ఆరోపించింది. వరదల నివారణలో తమ అశక్తతను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆప్ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని హర్యానా ప్రభుత్వం విమర్శించింది.

హర్యానా ముఖ్యమంత్రి సలహాదారు, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి దేవేంద్ర సింగ్ ఈ విషయంపై స్పందించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల ప్రకారం.. హాతికుండ్ బ్యారేజ్ నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని బట్టి ఏ కాలువలోకి వదలాలనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బ్యారేజ్ ఔట్ ఫ్లో ఒక లక్ష క్యూసెక్కుల కన్నా ఎక్కువగా ఉంటే తూర్పు, పశ్చిమ కాలువలలోకి నీటిని విడుదల చేయకూడదని వివరించారు. ఆ రెండు కాలువల నిర్మాణాలు, గేట్ల సామర్థ్యం ఆధారంగా సీడబ్ల్యూసీ ఈ సూచనలు చేసిందని చెప్పారు. అందువల్లే ఆ రెండు కాలువలను క్లోజ్ చేసి యమునా నదిలోకి నీటిని వదులుతున్నామని దేవేంద్ర సింగ్ తెలిపారు.


More Telugu News