ఆస్ట్రేలియాలో దారుణం.. భారతీయ విద్యార్థిపై తెల్లవారుజామున ఇనుప రాడ్లతో దాడి

  • ఖలిస్థానీ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్న భారతీయ విద్యార్థిపై సిడ్నీలో దాడి
  • యువకుడిని కారులోంచి బయటకు లాగి ఇనుప రాడ్లతో కొట్టిన ఖలిస్థానీ మద్దతుదారులు
  • దీన్నో గుణపాఠంగా భావించాలని యువకుడికి సూచన
  • తీరు మారకపోతే ఇలాంటి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుందంటూ వార్నింగ్
  • బాధితుడికి ఆసుపత్రిలో చికిత్స, దాడిని ఖండించిన మేర్రీల్యాండ్స్ ఎంపీ
ఖలిస్థానీ తీవ్రవాదాన్ని వ్యతిరేకించే ఓ భారతీయ విద్యార్థిపై(23) ఆస్ట్రేలియాలో దాడి జరిగింది. అతడిని ఖలిస్థానీ మద్దతుదారులు ఇనుప రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. సిడ్నీ నగరంలోని మేర్రీల్యాండ్స్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఉదయం 5.30 గంటలకు అతడు తన వాహనంలో బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అయిదుగురు ఖలిస్థానీవాదులు యువకుడిని చుట్టుముట్టారు. కారులో ఉన్న అతడి దవడపై ఇనుపరాడ్డుతో పొడిచారు. 

ఈలోపు మరికొందరు వాహనం తలుపు తెరిచి విద్యార్థిని బయటకు లాగి కింద పడేసి ఇనుప రాడ్లతో ఇష్టారీతిన దాడి చేశారు. ఖలిస్థానీ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తే ఇలాగే జరుగుతుందని అతడికి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనను ఓ గుణపాఠంగా భావించాలని యువకుడికి సూచించిన వారు.. అతడి తీరు మారకపోతే ఇలాంటి గుణపాఠాలు మరిన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

యువకుడికి తల, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలు కావడంతో అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న న్యూసౌత్ వేల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, మేర్రీల్యాండ్స్ ఎంపీ ఈ ఘటనను ఖండించారు. తమ ప్రాంతంలో హింసాత్మక చర్యలకు స్థానం లేదని వ్యాఖ్యానించారు.


More Telugu News