ఇస్రో శాస్త్రవేత్తల స్ఫూర్తికి, చాతుర్యానికి వందనం చేస్తున్నా: ప్రధాని మోదీ

  • చంద్రయాన్-3 భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశం
  • ఇస్రో శాస్త్రవేత్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపిన ప్రధాని 
  • భారత అంతరిక్ష పరిశోధన రంగం చరిత్రలో కొత్త అధ్యాయం అని వ్యాఖ్యలు
చంద్రయాన్-3 ఎలాంటి ఆటంకాలు లేకుండా కక్ష్యలోకి ప్రవేశించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. 

భారత అంతరిక్ష పరిశోధన రంగం చరిత్రలో ఇది కొత్త అధ్యాయం అని అభివర్ణించారు. ప్రతి భారతీయుడి కలలు, ఆశయాలను ఉన్నతం చేసే ఘట్టం అని పేర్కొన్నారు. ఈ ఘనవిజయం మన శాస్త్రవేత్తల అంకితభావానికి నిదర్శనం అని ప్రధాని మోదీ కొనియాడారు. శాస్త్రవేత్తల స్ఫూర్తికి, చాతుర్యానికి వందనం చేస్తున్నానని తెలిపారు. 

చంద్రయాన్-3 ప్రయోగంపై కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. దేశానికి ఇది గర్వించదగిన రోజు అని పేర్కొన్నారు. చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని తెలిపారు. దేశ సాంకేతిక అభివృద్ధికి ఇది తార్కాణం అని వివరించారు. 

దేశం గర్వపడేలా చేసిన ఇస్త్రో శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇస్రో శక్తి సామర్థ్యాలు పెంచిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.


More Telugu News