తెలంగాణపై బీజేపీ ఫోకస్.. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు

  • ఈ నెల 15 నుంచి 31 వరకు నిర్వహించాలని నిర్ణయం
  • ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజక వర్గాలకు తొలి ప్రాధాన్యత
  • సభలకు హాజరు కానున్న రాష్ట్ర నాయకత్వం
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర నాయకత్వ మార్పు తర్వాత ఎన్నికల కోసం కార్యాచరణను ముమ్మరం చేసింది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని చేసిన తర్వాత రాష్ట్ర పార్టీలో కొంత స్తబ్దత ఏర్పడింది. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్ సభ తర్వాత కమలనాథుల్లో జోష్ వచ్చింది. ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం అంటూ విమర్శించారు. ఇప్పుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో అదే ఊపును జనాల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర శాఖ కార్యాచరణ రూపొందించింది.

రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలో 119 నియోజక వర్గాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వనుంది. 19 ఎస్సీ నియోజక వర్గాలు, 12 ఎస్టీ నియోజకవర్గాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. తక్కువ సమయంలో ప్రజలకు చేరువయ్యేలా కార్యాచరణ రచించింది. రెండు వారాల్లోనే 31 సభల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. బీజేపీ సభలకు రాష్ట్ర నాయకత్వంలోని అగ్రనేతలు హాజరుకానున్నారు.


More Telugu News