హరీశ్ రావును ఎందుకు కలిశారో చెప్పిన రాజాసింగ్
- నియోజకవర్గంలోని ఆసుపత్రి అభివృద్ధి కోసం హరీశ్ ను కలిశానన్న రాజాసింగ్
- తాను బీజేపీలోనే ఉంటానని స్పష్టీకరణ
- తనపై బీజేపీ సస్పెన్షన్ ను ఎత్తి వేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వ్యాఖ్య
మంత్రి హరీశ్ రావుతో గోషామహల్ రాజాసింగ్ భేటీ అయిన విషయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో, రాజాసింగ్ పార్టీ మారుతున్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ స్పందిస్తూ... తన నియోజకవర్గంలో హాస్పిటల్ అభివృద్ధి కోసమే హరీశ్ రావును కలిశానని చెప్పారు. గోషామహల్ లో ఉన్న ఆసుపత్రిని 30 పడకలు లేదా 50 పడకలుగా అభివృద్ధి చేయాలని కోరానని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నానని చెప్పారు. తాను బీజేపీలోనే ఉంటానని, బీజేపీలోనే చస్తానని... తనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని స్పష్టం చేశారు. హిందూ దేశం కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.