బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం... తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు

  • రాగల ఐదు రోజులకు ఐఎండీ వాతావరణ నివేదిక
  • సాధారణ రుతుపవన ద్రోణి కొనసాగుతోందని వెల్లడి
  • రేపు, ఎల్లుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు
  • ఉత్తరాదిన కుండపోత వానలు కురిసే అవకాశం
ఓవైపు సాధారణ రుతుపవన ద్రోణి, మరోవైపు నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల రెండ్రోజుల పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. 

ఇక, ఉత్తరాదిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ లో 5 రోజుల పాటు భారీ వర్షాలు, యూపీలో రెండ్రోజుల పాటు కుండపోత వానలు కురుస్తాయని వెల్లడించింది. 

దక్షిణాదిన తమిళనాడులో రాగల రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కర్ణాటక, కేరళలో రాగల మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది.


More Telugu News