మీరా మా గురించి మాట్లాడేది?: బొత్సపై తెలంగాణ మంత్రుల ఫైర్
- తెలంగాణ విద్యా వ్యవస్థపై బొత్స వివాదాస్పద వ్యాఖ్యలు
- తీవ్రంగా స్పందించిన తెలంగాణ మంత్రులు
- నీ దగ్గర విద్యా వ్యవస్థ ఉందా? అంటూ గంగుల ప్రశ్న
- ఉమ్మడి ఏపీలో బొత్స ఎన్నో కుంభకోణాలు చేశారన్న శ్రీనివాస్ గౌడ్
- ముందు ఏపీ ప్రజల గురించి ఆలోచించాలన్న తలసాని
తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బోత్సపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నువ్వా మాకు చెప్పేదంటూ కౌంటర్ ఇస్తున్నారు.
‘‘బొత్స సత్యనారాయణ, ముందు నువ్వు తెలుసుకో.. నీ దగ్గర ఉన్న గురుకులాలు ఎన్ని.. మా దగ్గర ఎన్ని ఉన్నాయో చూడు. నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు.. నీ దగ్గర విద్యా వ్యవస్థ ఉందా.. నువ్వా మా విద్యార్థుల గురించి మాట్లాడేది” అని మంత్రి గంగుల కమలాకర్ నిప్పులుచెరిగారు. తెలంగాణపై ఇంకా కుట్రలేనా అంటూ విరుచుకుపడ్డారు. తాము ఏపీ జోలికి వెళ్లలేదని.. కానీ వాళ్లు మాట్లాడుతున్నందుకు తాము ఏం చేశామనేది చెప్పుకొవాల్సి వస్తోందని గంగుల అన్నారు.
మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఏపీ ఉందని ఎద్దేవా చేశారు. వారికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. ‘‘బొత్స ఎవరు? వోక్స్‌వాగన్ కార్లను చూస్తే గుర్తొచ్చేది ఆయనే కదా. ఉమ్మడి ఏపీలో ఆయన ఎన్నో కుంభకోణాలు చేశారు” అని ఆరోపించారు. గతంలో ఏపీపీఎస్సీలో స్కామ్‌లు జరిగాయని ఆరోపించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ముందు ఏపీ ప్రజల బాగోగులు చూసుకోవాలని బొత్సకు హితవు పలికారు. ఆ తర్వాత తెలంగాణ గురించి ఆలోచించాలని అన్నారు.