మరో రెండేళ్లలో ఇంటర్నెట్ వ్యవస్థ అంతం?.. పెదవి విప్పని నాసా!

  • 2025లో ‘సోలార్ మ్యాగ్జిమమ్’కు చేరుకోనున్న సూర్యుడు
  • అప్పుడు సంభవించే సౌరతుపాన్లు భూమిని బలంగా తాకే అవకాశం
  • ఆ దెబ్బకు కుప్పకూలనున్న ఇంటర్నెట్ వ్యవస్థ
  • ‘ఇంటర్నెట్ అపోకలిప్స్’పై ప్రపంచవ్యాప్తంగా చర్చ
మరో రెండేళ్లలో ఇంటర్నెట్ అంతమైపోతుందంటూ ‘వాషింగ్టన్ పోస్ట్’లో వచ్చిన కథనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంటర్నెట్‌లోనూ ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. 2025 నాటికి సూర్యుడు ‘సోలార్ మ్యాగ్జిమమ్’ (గరిష్ఠస్థాయికి) చేరుకుంటాడని, అప్పుడు సోలార్ సైకిళ్ల కారణంగా సంభవించే సౌర తుపాన్లు భూమికి చేరుకుని కమ్యూనికేషన్ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తాయన్నది ఆ కథనం సారాంశం. ‘సోలార్ మ్యాగ్జిమమ్’కు డిజిటల్ ప్రపంచం సిద్ధం కాకపోవడంతో ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలిపోతుందని పేర్కొంది. దీనిని ‘ఇంటర్నెట్ అపోకలిప్స్’గా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైన చర్చ జరుగుతున్నప్పటికీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు.  

అయితే, జనం మాత్రం ఆన్‌లైన్ వేదికగా దీనిపై చర్చించుకుంటున్నారు. ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలితే జరిగే పరిణామాలపై అభిప్రాయాలు పంచుకుంటున్నారు. అంతర్ అనుసంధానిత ప్రపంచంలో ఇప్పటి వరకు జరగని అరుదైన సంఘటన జరిగి ఇంటర్నెట్‌కు విఘాతం కలుగుతుందని వాష్టింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఈ సందర్భంగా 1859లో జరిగిన క్యారింగ్టన్ ఈవెంట్ ‌ను ప్రస్తావించింది. దీని కారణంగా అప్పట్లో టెలిగ్రాఫ్ లైన్లు ధ్వంసమయ్యాయి. ఎంతోమంది ఆపరేటర్లు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఆ తర్వాత 1989లో సౌర తుపాను కారణంగా క్యూబెక్ పవర్ గ్రిడ్‌ కుప్పకూలింది.  

సోలార్ మ్యాగ్జిమమ్‌పై కాలిఫోర్నియా యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ సంగీత అబ్దు జ్యోతి రాసిన పేపర్ ‘సోలార్ సూపర్‌స్టార్మ్స్: ప్లానింగ్ ఫర్ ఇంటర్నెట్ అపోకలిప్స్’ కారణంగానే ‘ఇంటర్నెట్ అపోకలిప్స్’ అనే పదం ఇప్పుడు వైరల్ అవుతోంది. శక్తిమంతమైన సౌర తుపానులు కనుక సంభవిస్తే దానికి మన మౌలిక సదుపాయాలు ఎలా స్పందిస్తాయో చూడాలని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి తుపాన్ల కారణంగా సముద్ర గర్భంలోని కమ్యూనికేషన్ కేబుళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. ఇటువంటి అంతరాయాలు నెలల తరబడి కొనసాగుతాయని అన్నారు. అదే జరిగితే అమెరికాలో రోజుకు 11 బిలియన్ల డాలర్లపైనే నష్టం వాటిల్లుతుందని వివరించారు.


More Telugu News